భూమి కోసం కన్నతల్లిని హతమార్చిన కొడుకు
కనకవ్వకు ఆమె తండ్రి జంగపల్లి శివారులో రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. దానిని కౌలుకిచ్చి ఆమె బతుకుతోంది. ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని తల్లితో వినోద్ ఏడాదిగా గొడవ పడుతున్నాడు.
భూమి కోసం కన్నతల్లిని కొడుకే హతమార్చిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గన్నేరువరం మండలం రేణికుంటకు చెందిన తుమ్మనవేణి కనకవ్వ (56)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు వినోద్ సంతానం. వారందరికీ వివాహాలయ్యాయి. కనకవ్వ భర్త గతంలోనే మృతి చెందాడు. కుటుంబానికున్న 1.20 ఎకరాల భూమిని ఆమె కుమారుడు వినోద్ సాగు చేస్తున్నాడు.
కనకవ్వకు ఆమె తండ్రి జంగపల్లి శివారులో రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. దానిని కౌలుకిచ్చి ఆమె బతుకుతోంది. ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని తల్లితో వినోద్ ఏడాదిగా గొడవ పడుతున్నాడు. అతని గొడవ భరించలేక ఆమె కొద్ది నెలలుగా అద్దె ఇంట్లో ఉంటోంది. బుధవారం వినోద్ జంగపల్లిలోని తల్లి భూమి వద్దకు వెళ్లి తానే సాగు చేసుకుంటానని పనులు ప్రారంభించాడు.
విషయం తెలుసుకున్న కనకవ్వ అక్కడికి వెళ్లి కొడుకుతో వాగ్వాదానికి దిగింది. ఆ భూమిని కూడా తీసుకుంటే తానెలా బతికేదని నిలదీసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం పెరిగి కోపోద్రిక్తుడైన వినోద్ తన చేతిలో ఉన్న పారతో తల్లి తలపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కనకవ్వ చిన్న కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కడే కొడుకని అల్లారుముద్దుగా పెంచుకుంటే.. అతనే కర్కశంగా వ్యవహరించి తల్లి ప్రాణాలు తీయడం స్థానికులను కలచివేసింది.