Telugu Global
Telangana

తెలంగాణలో అభివృద్ధిని చూసి కొంత మంది తట్టుకోలేకపోతున్నారు : మంత్రి జగదీశ్ రెడ్డి

సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఈ గైర్హాజరుతో గవర్నర్ తమిళిసై నిజ స్వరూపం బయటపడిందని మంత్రి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అభివృద్ధిని చూసి కొంత మంది తట్టుకోలేకపోతున్నారు : మంత్రి జగదీశ్ రెడ్డి
X

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంత మంది తట్టుకోలేక పోతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రగతి నిరోధకులు ఈ అభివృద్ధిని చూసి కుళ్లుకుంటున్నారని చెప్పారు. కొత్త సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై గైర్జాజరు కావడం దీనిలో భాగమేనని ఆరోపించారు. ప్రగతి నిరోధకులు రానంత మాత్రాన.. తెలంగాణకు జరిగే నష్టం ఏమీ లేదని చెప్పారు.

సూర్యపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఈ గైర్హాజరుతో గవర్నర్ నిజ స్వరూపం బయటపడిందని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకగా కొత్త సచివాలయం నిలిచిపోతుందని అభివర్ణించారు. ఇటు వంటి భవనాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

మంచిని మంచిగా చూసే గుణం కూడా ప్రతిపక్షాలకు లేకపోవడం దురదృష్టకరమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధితో తమ అడ్రెస్ శాశ్వతంగా గల్లంతు అవుతుందనే బెంగ ప్రతిపక్షాలకు పట్టుకున్నదని.. అందుకే అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన విరుచుకపడ్డారు. ఇలాంటి వారికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం తరపున ఆహ్వానం అందినా.. ఆమె కావాలని గైర్హాజరై.. పుదుచ్చేరికి వెళ్లరని మంత్రి ఆరోపించారు.

గవర్నర్‌ను నియమించిన కేంద్రంలోని బీజేపీ ఇలా అభివృద్ధికి అడ్డు పడుతోందన్నారు. వారి నాయకత్వంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. గుజరాత్ మోడల్ ఎలా ఫెయిల్ అయ్యిందో అందరూ చూస్తున్నారన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చి చూస్తే... ఎవరు ఎలాంటి పాలన అందిస్తున్నారో కనపడుతుందన్నారు. బీజేపీకి తెలంగాణ అభివృద్ధి చూసి ఈర్ష్య కలుగుతోందని మంత్రి చెప్పారు.


First Published:  1 May 2023 5:24 PM IST
Next Story