చేనేత కార్మికుల కడుపు కొడుతున్న మోడీ సర్కార్.. కేటీఆర్ ఫైర్
కేంద్రప్రభుత్వం చేనేత కార్మికుల కడుపుకొడుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.మోదీకి నేతన్నలపై ప్రేమ ఉంటే తెలంగాణాలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేంద్రం లోని మోడీ సర్కార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతోందని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. టెక్స్ టైల్- చేనేత రంగంపై ప్రభుత్వం కక్ష గట్టిందని, సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఇదివరకే ఎన్నోసార్లు కోరామని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కు రాసిన లేఖలో ఆయన.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు కేంద్రం నుంచి సాయం కరువైందని అన్నారు. దేశంలోని పలు రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే జౌళి, చేనేత రంగాలను కూడా నిర్వీర్యం చేశారని, అందుకే చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాకతీయ టెక్స్ టైల్ పార్కుకోసం యంగ్ వన్ కంపెనీ పెట్టుబడులు పెట్టిందని, ఇది ప్రపంచ టెక్స్ టైల్ దిగ్గజాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇంతటి జాతీయ ప్రాధాన్యం కలిగిన టెక్స్ టైల్ మెగా పార్క్ కి కేంద్రం సహకరించకపోవడమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు.
శుష్క వాగ్దానాలు, రిక్త హస్తాలు అన్నట్టు వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణ నేతన్నల కడుపు కొడుతుందన్నారు. హైదరాబాద్ లో జాతీయ జౌళి పరిశోధనా సంస్థతో బాటు హ్యాండ్ లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరాం. 'దీనికి కూడా కేంద్రం నుంచి స్పందన కరవైంది. నేషనల్ హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దేశంలో ఆగస్టు 7 న చేనేత జాతీయ దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేత కార్మికుల అభివృద్ధికి కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలి' అని ఆయన అన్నారు.
తెలంగాణాలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి. దేశంలోని నేతన్నలపై ప్రేమ ఉంటే ఈ నెల 7 నాటికి ఈ దిశగా చర్యలు తీసుకోవడం ఎంతయినా అవసరమని కేటీఆర్.. తమ లేఖలో అభ్యర్థించారు.