నిత్యపెళ్లికొడుకుగా సాప్ట్‌వేర్ ఇంజనీర్.. వారంలోనే నాలుగో పెళ్లికి రెడీ
ఇది వరకే వివాహాలు జరిగినందున గ్రాండ్‌గా మరోసారి పెళ్లి చేసుకోవడం బాగుండదని వైద్యురాలిని ఒప్పించాడు. సింపుల్‌గా పెళ్లి చేసుకుందామంటూ ఈనెల 4న ఇంట్లోనే తాళి కట్టేశాడు.
హైదరాబాద్‌లో ఒక సాప్ట్‌వేర్ ఉద్యోగి నిత్య పెళ్లికొడుకుగా మారిపోయాడు. పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం, వెంటనే మ్యాట్రిమోనీలో కొత్త తోడు కోసం దరఖాస్తు చేయడం ఇతడికి అలవాటుగా మారింది. ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని వారికి విడాకులు ఇచ్చేశాడు.
కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన 39ఏళ్ల వంశీకృష్ణ హైటెక్ సిటీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరికి విడాకులు ఇచ్చిన వంశీకృష్ణ కొద్దికాలం క్రితం మూడో వివాహం కోసం మ్యాట్రిమోనీలో వివరాలు పొందుపరిచాడు.
వంశీకృష్ణ ప్రొఫైల్‌ను చూసిన నెల్లూరుకు చెందిన ఒక వైద్యురాలు అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. సదరు వైద్యురాలికి భర్త చనిపోయారు. వంశీకృష్ణను వివాహం చేసుకునేందుకు వైద్యురాలి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అలా వంశీకృష్ణతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం ఆమెను హైదరాబాద్ రప్పించుకున్నాడు.
ఇది వరకే వివాహాలు జరిగినందున గ్రాండ్‌గా మరోసారి పెళ్లి చేసుకోవడం బాగుండదని వైద్యురాలిని ఒప్పించాడు. సింపుల్‌గా పెళ్లి చేసుకుందామంటూ ఈనెల 4న ఇంట్లోనే తాళి కట్టేశాడు. ఆ తర్వాత వారం పాటు వంశీకృష్ణతోనే వైద్యురాలు హైదరాబాద్‌లో గడిపారు. అనంతరం ఆమె నెల్లూరు వెళ్లింది. ఈనెల 24న ఆమె తిరిగి రాగా వంశీకృష్ణ తేడాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మనకు సెట్ అవ్వదంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. తాను పోలీస్ కేసు పెడుతానని వైద్యురాలు హెచ్చరించగా.. మాట్లాడుకుందామంటూ రెండు రోజుల పాటు ఇంట్లోనే తాళం వేసి ఆమెను బంధించాడు.
ఇంతలో నాలుగో పెళ్లి కోసం వంశీకృష్ణ మ్యాట్రిమోనీలో మరో దరఖాస్తు పెట్టాడు. ఇటీవలే నెల్లూరుకు చెందిన వైద్యురాలితో తాము సంబంధం కుదిర్చిన విషయాన్ని గమనించిన మ్యాట్రిమోనీ నిర్వాహకులు వైద్యురాలికి ఫోన్ చేసి వంశీకృష్ణ దరఖాస్తు గురించి వివరించారు. అప్పుడు వారికి జరిగిందంతా ఆమె వివరించారు. తెలిసిన వారి సాయంతో వంశీకృష్ణ ఇంటి నుంచి బయటపడిన వైద్యురాలు.. మ్యాట్రిమోనీ ప్రతినిధులతో కలిసి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణ కోసం గాలిస్తున్నారు.