Telugu Global
Telangana

రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ పదాలు మాయం..!

సోషల్ స్టడీస్ కవర్ పేజీలపై రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు కావాలని తొలగించలేదన్నారు SCERT డైరెక్టర్ రాధారెడ్డి. సబ్జెక్ట్ కమిటీ పుస్తకంలోని పాఠ్యాంశాలను పరిశీలించిందని, కానీ కవర్ పేజీపై ఉన్న పొరపాటును గమనించలేదన్నారు.

రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ పదాలు మాయం..!
X

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది SCERT తీరు. సర్వత్రా విమర్శలు వచ్చాక రాజ్యాంగ పీఠిక విషయంలో జరిగిన తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది. 10వ తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై ముద్రించిన అసమగ్ర రాజ్యాంగ పీఠికపై విమర్శలు వెల్లువెత్తాయి. SCERT ముద్రించిన రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు అదృశ్యమవ్వడమే అందుకు కారణం.

42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను చేర్చారు. కాగా.. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ముద్రించిన పాఠ్యపుస్తకాల కవర్‌ పేజీపై పీఠికలో మాత్రం ఈ పదాలకు మిస్‌ అయ్యాయి. రాజ్యాంగంలోంచి సెక్యులర్‌ అనే పదాన్ని తొలగించాలని చాలాకాలంగా హిందుత్వ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ కావాలనే రాజ్యాంగ పీఠిక నుంచి ఆ పదాలను తొలగించిందా..? అనే చర్చ మొదలైంది.

వాస్తవానికి ఇంటర్నెట్ నుంచి రాజ్యాంగ సవరణకు ముందున్న పీఠికను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చేసినట్లు తెలుస్తోంది. అధికారులు ఎవరూ తప్పును గుర్తించకుండా విడుదల చేయడంతో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ పీఠిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలకు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

కాగా.. సోషల్ స్టడీస్ కవర్ పేజీలపై రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు కావాలని తొలగించలేదన్నారు SCERT డైరెక్టర్ రాధారెడ్డి. సబ్జెక్ట్ కమిటీ పుస్తకంలోని పాఠ్యాంశాలను పరిశీలించిందని, కానీ కవర్ పేజీపై ఉన్న పొరపాటును గమనించలేదన్నారు. ఇంటర్‌నెట్‌ నుంచి పాత పీఠికను డౌన్ లోడ్ చేయడం వల్ల ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు.

జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ.. సోషలిస్ట్, సెక్యులర్ పదాలు ఉన్న పీఠికను టెక్ట్స్‌ బుక్స్‌పై అంటించాలని SCERT ఆదేశాలు జారీ చేసింది.

First Published:  24 Jun 2023 7:13 AM IST
Next Story