Telugu Global
Telangana

మండలి ఛాంబర్ లో ఫొటోల గొడవ

మహనీయుల సరసన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం వారిని అవమానించడమేనంటూ బాల్క సుమన్ ట్వీట్ వేశారు.

మండలి ఛాంబర్ లో ఫొటోల గొడవ
X

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కాస్త దూకుడు తగ్గించింది. అదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం హామీల అమలు విషయంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాయి. ఎన్నికల కోడ్ ముగిసింది కదా.. ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నాయి. ఈ గొడవతోపాటు.. అధికార, ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా వార్ కూడా మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేసిన ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రెండు పార్టీల నేతలు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి ఫొటో ఎందుకు..?

మహనీయుల సరసన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం వారిని అవమానించడమేనంటూ బాల్క సుమన్ ఓ ట్వీట్ వేశారు. శాసనమండలి ఛాంబర్ లో ఓవైపు జాతిపిత మహాత్మా గాంధీ ఫొటో, మరోవైపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ఉండగా.. మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఎలా పెడతారని ఆయన నిలదీశారు. సామాజిక వేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలే వంటి వారి చిత్రపటాల సరసన రేవంత్ రెడ్డి ఫొటో పెట్టడం పట్ల అందరూ ఆశ్చర్యం వక్తం చేస్తున్నారని బాల్క సుమన్ ట్వీట్ ద్వారా సెటైర్లు పేల్చారు.


కాంగ్రెస్ కౌంటర్..

అది ప్రోటోకాల్ అని, ఆ మాత్రం తెలియని సుమన్.. పదేళ్లపాటు ప్రజా ప్రతినిధిగా ఎలా పనిచేశారని కాంగ్రెస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా ఫొటోలు పెట్టారని, ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

First Published:  14 Jun 2024 7:20 AM GMT
Next Story