Telugu Global
Telangana

స్మితా సబర్వాల్‌కు బుట్టెడు మామిడి పండు.. దీని వెనుక ఉన్న సర్‌ప్రైజ్ స్టోరీ తెలుసా?

ఆ స్వీట్ సర్‌ప్రైజ్ గురించి స్మితా సభర్వాల్ తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

స్మితా సబర్వాల్‌కు బుట్టెడు మామిడి పండు.. దీని వెనుక ఉన్న సర్‌ప్రైజ్ స్టోరీ తెలుసా?
X

ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ గురించి తెలియని వారుండరు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథను ఆమే పర్యవేక్షిస్తున్నారు. గతంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో కూడా ప్రజల అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె సమర్థతను గుర్తించిన సీఎం కేసీఆర్ కీలకమైన బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇప్పుడు విషయం వేరే ఉంది.

సీఎంవోలో పని చేస్తున్న స్మితా సభర్వాల్‌కు ఒకరు బుట్టెడు మామిడి పండ్లు పంపారు. దానిలో విశేషం ఏముంది.. ఆమె పెద్ద ఆఫీసర్, పైగా సీజన్ కాబట్టి ఎవరో అభిమానంతో పంపి ఉంటారని మీరు భావిస్తుండొచ్చు. అదే విషయం అయితే.. ఈ వార్తకు అర్థమే లేదు కదా.! అసలు విషయం ఏంటంటే.. స్మితా సభర్వాల్ మూడేళ్ల క్రితం నాటిన మామిడి మొక్క పెరిగి పెద్దదై కాయలు కాసింది. ఆ మామిడి చెట్ల పండ్లే స్మితా సభర్వాల్‌కు పంపారు. ఈ స్వీట్ సర్‌ప్రైజ్ అందుకున్న స్మిత సభర్వాల్.. తన సంతోషాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.

మిషన్ భగీరథ ఇంచార్జిగా ఉన్న ఆమె మూడేళ్ల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వెళ్లారు. ఒక రోజు వర్షం పడుతున్న సమయంలోనే హరిత హారంలో భాగంగా మామిడి మొక్కను నాటారు. మూడేళ్ల తర్వాత ఆ మొక్క భారీ చెట్టుగా మారకపోయినా.. కాయలు మాత్రం విరగకాసింది. ఆ పండ్లే స్మితా సభర్వాల్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా పంపారు.

ఆ స్వీట్ సర్‌ప్రైజ్ గురించి స్మితా సభర్వాల్ తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. 'మనం ఏం విత్తుతామో అవే కోస్తాము. కొల్లాపూర్‌లో మూడేళ్ల క్రితం వర్షం పడిన రోజు నాటిన మామిడి మొక్క.. ఈ రోజు నాకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. థాంక్యూ శ్రీనివాస్‌ గారూ' అంటూ ఆ మొక్కను రక్షించిన తోటమాలిని అభినందించారు.


First Published:  20 May 2023 5:40 PM IST
Next Story