Telugu Global
Telangana

తెలంగాణలో చిన్న పార్టీలే కొంప ముంచుతాయా?

బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు 3వేల నుంచి 5 వేల ఓట్లు తెచ్చుకున్నారు.

తెలంగాణలో చిన్న పార్టీలే కొంప ముంచుతాయా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తం అయ్యాయి. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచార సభల వరకు మిగతా పార్టీల కంటే దూకుడుగా ఉన్నది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. బీజేపీ కూడా బహిరంగ సభలు నిర్వహిస్తూ మేమూ పోటీలో ఉన్నాం అని చెప్పుకుంటున్నది. అయితే ఇప్పుడు అన్ని పెద్ద పార్టీలకు ఒక భయం పట్టుకున్నది.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, దాని మిత్ర పక్షంగా చెప్పుకుంటున్న జనసేన కూడా తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఏపీలో కలిసి పోటీ చేస్తామని చెప్పుకుంటున్న ఈ రెండు పార్టీలు.. తెలంగాణలో ఎలా ముందుకు వెళ్తాయన్న విషయంపై స్పష్టత లేదు. పైగా ఈ రెండు పార్టీలో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలైతే కావు. వీటికితోడు బీఎస్పీ, తెలంగాణ జన సమితి కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండు పార్టీలను పక్కన పెడితే.. మిగిలిన చిన్న పార్టీల ఓటు బ్యాంకు ఇప్పుడు ప్రధాన పార్టీలను భయపెడుతున్నాయి.

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచినా.. ఆ తర్వాత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారు. తెలుగు దేశం పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉన్నది. జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లలో ఎక్కువ మంది ఆంధ్రా సెటిలర్లే. కొన్నేళ్ల నుంచి వీరు టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు 3వేల నుంచి 5 వేల ఓట్లు తెచ్చుకున్నారు.

టీడీపీ అభిమానులు చాలా వరకు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్లిపోయినా.. ఇంకా కొంత మంది అదే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యూపీతో పాటు ఉత్తరాదిలో బలంగా ఉన్న బీఎస్పీ గతంలో పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. టికెట్లు రాని కొంత మంది బీఎస్పీ తరపున టికెట్ తెచ్చుకొని గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ బీఎస్పీ వల్లే వాళ్లు గెలిచారనడానికి వీలు లేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన తర్వాత బీఎస్పీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డారు.

గురుకులాల సెక్రటరీగా పని చేసే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో అనే పేరుతో ఒక వర్గాన్ని క్రియేట్ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో స్వేరోలు ఉన్నారు. వీళ్ల కుటుంబాల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో 1000 నుంచి 3000 వేల వరకు ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే.. చాలా చోట్ల గెలుపోటములు 3000 వేల లోపు ఓట్ల తేడాతోనే ఉన్నాయి. ఇక షర్మిల పార్టీ ఓటు వేసే వైఎస్ఆర్ అభిమానులు కూడా ఉంటారు. వీళ్ల వల్ల కూడా ఇతర పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. టీడీపీ, బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు గెలవలేకపోయినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై మాత్రం ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.

ఈ రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటే ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే అవి ఈ పార్టీల మధ్య చీలిపోయే అవకాశం ఉందని.. కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు చీలిపోవడం వల్ల అంతిమంగా అది బీఆర్ఎస్‌కు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల గెలుపోటములను చాలా నియోజకర్గాల్లో చిన్న పార్టీలనే నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే ఈ ఇబ్బందిని అధిగమించే అవకాశం ఉంది. కానీ వామపక్షాలు బలంగా లేని చోట్ల మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పదనే చర్చ జరుగుతోంది.

First Published:  11 Oct 2023 3:06 AM GMT
Next Story