స్కిల్ యూనివర్సిటీకి భూమిపూజ
జూన్ 2వ తేదీకి తొలి దశ భవనాలు నిర్మిస్తాం : మేఘా ఇంజనీరింగ్ సంస్థ
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ శుక్రవారం భూమిపూజ చేసింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేటలోని నెట్ జీరో వ్యాలీలో ఎంఈఐఎల్ డైరెక్టర్ రవి పి. రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రవి పి. రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్ రెండో తేదీ) నాటికి తొలిదశ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఎయిర్ కండీషన్ లతో అవసరం లేకుండా ఓపెన్ ఎయిర్ వ్యవస్థ, మంచి వెంటలేషన్ తో భవనాలు నిర్మిస్తున్నామని వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భవనాలు నిర్మిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల రూ.200 కోట్ల విరాళం అందజేశామని, అదే సమయంలో భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్, లైబ్రరీ, ఆడిటోరియం, అత్యాధునిక క్లాస్ రూములు, లాబొరేటరీలు, ఇతర మౌళిక వసతులు కల్పిస్తామని తెలిపారు.