Telugu Global
Telangana

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

బాలానగర్‌ మండలంలోని మేడిగడ్డ తండా, నందారం, బీబీనగర్‌ తండాల నుంచి మండల కేంద్రమైన బాలానగర్‌లో జరిగే వారపు సంతకు గిరిజనులు ఆటోలో వచ్చారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
X

వారంతా తండాలకు చెందిన గిరిజనులు.. వారం వస్తే సంతకు వెళ్లి కూరగాయలు, ఇతర నిత్యావసర స‌రుకులు తెచ్చుకోవడం వారికి మామూలే. శుక్రవారం కూడా అదే విధంగా గిరిజనులంతా కలిసి ఆటోలో బయలుదేరి సంతకు వెళ్లారు. కావాల్సినవన్నీ కొనుగోలు చేసి తిరిగి ఆటోలో తండాకు వెళుతుండగా.. వారిని మృత్యువు వెంటాడింది. వీరి ఆటోను డీసీఎం వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని బాలానగర్‌ చౌరస్తాలో జ‌రిగిన‌ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలానగర్‌ మండలంలోని మేడిగడ్డ తండా, నందారం, బీబీనగర్‌ తండాల నుంచి మండల కేంద్రమైన బాలానగర్‌లో జరిగే వారపు సంతకు గిరిజనులు ఆటోలో వచ్చారు. శుక్రవారం సాయంత్రం వారంతా ఆటోలో తిరిగి వెళుతుండగా, బాలానగర్‌ చౌరస్తాలో ఆగివున్న వీరి ఆటోను డీసీఎం వాహనం ఢీకొట్టింది. పలువురు గాయాల పాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  5 Jan 2024 9:00 PM IST
Next Story