Telugu Global
Telangana

ఆరుగురి ప్రాణాలు తీసిన లారీ.. తెలంగాణలో ఘోరం

లారీ ఢీ కొట్టిన ఆటోలో ఏడుగురు ప్రయాణం చేస్తుండగా.. నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురిలో ఇద్ద‌రు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఆరుగురి ప్రాణాలు తీసిన లారీ.. తెలంగాణలో ఘోరం
X

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టిన ఘటనలో.. ఆరుగురు ప్రాణాలు విడిచారు. వరంగల్ - తొర్రూరు మార్గంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొట్టిన ధాటికి ఆటో పూర్తిగా ధ్వంస‌మైంది. వర్దన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఈ ప్ర‌మాదం జరిగింది. లారీ ఢీ కొట్టిన ఆటోలో ఏడుగురు ప్రయాణం చేస్తుండగా.. నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురిలో ఇద్ద‌రు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.

మృతులు వరంగల్ శివనగర్‌కు చెందిన భట్టు శ్రీనివాస్, రాజస్థాన్‌కు చెందిన జాబోదు, నితీశ్, రూప్ చంద్, బిహార్‌కు చెందిన సురేశ్, మేరీగా పోలీసులు గుర్తించారు. మ‌రో వ్య‌క్తి రాజస్థాన్‌కు చెందిన అమీర్ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలను తెలుసుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వరంగల్ కు వలస వచ్చిన వీళ్లు.. తేనె అమ్ముకుంటూ ఇన్నాళ్లూ ఉపాధి పొందినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరి మరణంతో ఆయా కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాధిత కుటుంబాలకు పోలీసులు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

లారీ అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా స్పష్టమవుతోంది. ఆటోలో ఉన్న వ్యక్తులను ఈడ్చుకుంటూ వెళ్లగా ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడవడం కనిపిస్తోంది.

First Published:  16 Aug 2023 12:50 PM
Next Story