ఆరు గ్యారెంటీలు వర్సెస్ అప్పులు.. తెలంగాణలో అసలేం జరుగుతోంది..?
ఒకవేళ ఫలానా పథకం ఎందుకు లేటయిందని ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. ఇదిగో ఫలానా చోట మీరు చేసిన అప్పు ఇదీ అంటూ వారు శ్వేతపత్రం చూపిస్తారు.
తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలి విడతగా రెండు హామీలను అమలులో పెట్టింది. అసలవి గ్యారెంటీలే కాదు, అందులో కొన్ని భాగాలు మాత్రమేనంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతు బంధు ఎప్పటినుంచి విడుదల చేస్తారంటూ అసెంబ్లీలోనే ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లోపు అమలులోకి వస్తాయని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అప్పులపై ఆందోళన..
అధికార మార్పు తర్వాత ప్రతి డిపార్ట్ మెంట్ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. తాము అధికారంలోకి వచ్చేనాటికి పరిస్థితి ఎలా ఉంది..? వచ్చాక ఎలా ఉంటుంది..? అనే విషయంపై ప్రజలకు వారు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ పై సమీక్ష చేపట్టారు. 80వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని తేల్చారు. అయితే బీఆర్ఎస్ అప్పుడే కౌంటర్ ఇచ్చింది. ఆ అప్పులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి కావని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22వేల కోట్ల అప్పుని తమకి అప్పగించాయని వివరించింది. తమ హయాంలో చేసిన అప్పుల ద్వారా విద్యుత్ రంగంలో వచ్చిన మార్పుల్ని, ప్రజలకు కలిగిన సౌకర్యాలను వివరించింది. అయితే కాంగ్రెస్ మాత్రం "అప్పులు 80వేల కోట్లు".. అనే విషయాన్ని మాత్రమే హైలైట్ చేయాలనుకుంటోంది.
తెలంగాణ రాష్ట్రం డిస్కంలకు చెల్లించే అప్పుల మీద జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు
— BRS News (@BRSParty_News) December 9, 2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ. 80 వేల కోట్ల అప్పు బాకీ ఉందని కొందరు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు అని.. విద్యుత్ సంస్థలు దివాలా… pic.twitter.com/YqHbQ6BKwR
ఐదున్నర లక్షల కోట్ల అప్పు..
ఇక ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించిన ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదని చెప్పారు. అయినప్పటికీ దీన్ని తాము చాలెంజ్ గా తీసుకుంటున్నామని, సవాళ్ళను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలిసికట్టుగా సాధిద్దామన్నారు భట్టి. ఉద్యోగులంతా మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పరోక్షంగా తెలంగాణ అప్పుల్లో ఉందన్న విషయాన్ని ఆయన హైలైట్ చేశారు.
గ్యారెంటీలు ఇస్తామని తాము హామీ ఇచ్చినా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దానికి సానుకూలంగా లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే అప్పుల లెక్కలన్నీ చెబుతున్నారు. మరిన్ని విభాగాల్లో ఇలాంటి లెక్కలు బయటకొస్తాయి. శ్వేత పత్రాలు విడుదలవుతాయి. ఒకవేళ ఫలానా పథకం ఎందుకు లేటయిందని ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. ఇదిగో ఫలానా చోట మీరు చేసిన అప్పు ఇదీ అంటూ వారు శ్వేతపత్రం చూపిస్తారు. అంటే ఆరు గ్యారెంటీలు లేటయినా సర్ది చెప్పుకోడానికి సరైన కారణాలు చూపించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అసాధ్యమని తెలిసినా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలిచ్చిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తమ గ్యారెంటీలు అసాధ్యం కాదని, అలాంటి పరిస్థితుల్ని బీఆర్ఎస్ సృష్టించి రాష్ట్రాన్ని తమకు అప్పగించిందని విమర్శలు మొదలు పెడుతోంది కాంగ్రెస్. మొత్తమ్మీద ఈ పొలిటికల్ గేమ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.