బంగారం దొంగలను పట్టిచ్చిన తెల్ల చొక్కా - నాగోల్ కాల్పుల కేసులో ఆరుగురి అరెస్టు.. పరారీలో మరో నలుగురు
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజీల్లో బన్సీరామ్ తెల్ల చొక్కా ధరించి ఉండటాన్ని గుర్తించారు. దోపిడీకి ముందు రాజ్‌కుమార్ ఎక్కడెక్కడ తిరిగాడో పరిశీలించగా, ఆయా ప్రాంతాల్లో బన్సీరామ్ అతన్ని అనుసరించినట్టు తేటతెల్లమైంది.
కోటి 36 లక్షల రూపాయల విలువైన బంగారం దోపిడీ చేసిన దొంగలను ఓ తెల్ల చొక్కా పట్టిచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సహా నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2.7 కిలోల బంగారం, రూ.65,500 నగదు, మూడు దేశవాళీ పిస్టళ్లు, 25 రౌండ్ల బుల్లెట్లు, ఒక ఎయిర్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ నాగోల్ కేసు వివరాలను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఎల్బీ నగర్‌లో బుధవారం వెల్లడించారు.
పార్టనర్స్‌ను చేర్చుకుని.. ప్రణాళిక వేసి..
సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్ నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి దుకాణాలకు విక్రయించే స్థానిక వ్యాపారి రాజ్‌కుమార్ సురానాను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన మహేంద్రకుమార్ చౌదరి (35) ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి. గజ్వేల్‌లో ఇతను ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. భారీగా డబ్బు సంపాదించేందుకు దోపిడీ చేయాలని ప్రణాళిక వేశాడు.
ఇందుకోసం గతంలో రాజ్‌కుమార్ దుకాణంలో పనిచేసిన రామాయంపేటకు చెందిన బన్సీరామ్ (23) సహకారం కోరాడు. అలాగే మహేంద్ర తన భార్య గుడియా జాట్, బావమరిది సుమేర్ చౌదరి, ఆభరణాల దుకాణంలో పనిచేసే మనీష్ వైష్ణవ్ (31), గతంలో పాలకుర్తిలోని తన దుకాణంలో పనిచేసిన రాజస్థాన్‌కు చెందిన రితేశ్ వైష్ణవ్ (32), గజ్వేల్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మహ్మద్ ఫిరోజ్ (31), రాజస్థాన్, హరియాణాకు చెందిన దోపిడీ దొంగలు సుమీత్ దగర్, మనీశ్, మన్యాలను ఈ దోపిడీ వ్యవహారంలో పార్టనర్స్ గా చేర్చుకున్నాడు.
రెక్కీ వేసి..
ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్టోబర్ తొలి వారంలో రాజ్‌కుమార్ ఎక్కడెక్కడికి వెళుతున్నాడో బన్సీరామ్ రెక్కీ చేశాడు. అనంతరం డిసెంబరు 1న దోపిడీ చేయాలని ప్లాన్ చేశారు. రాజ్‌కుమార్ తన సహాయకుడు సుఖ్‌రామ్‌తో కలసి డిసెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో సికింద్రాబాద్ పాట్ మార్కెట్ నుంచి 3 కేజీల బంగారంతో బయలుదేరాడు. మన్యా, సుమిత్ దగర్, బన్సీరామ్, మనీశ్ బైక్‌లపై వారిని అనుసరించారు. నాగోల్ స్నేహపురి కాలనీలోని బంగారు దుకాణానికి రాత్రి 8 గంటల సమయంలో వారు చేరుకున్నారు. అక్కడ దుకాణ యజమాని కల్యాణ్ చౌదరికి బంగారు ఆభరణాలు చూపిస్తుండగా, సుమిత్ దగర్, మనీశ్ దుకాణంలోకి చొరబడ్డారు. ఆ వెంటనే సుమిత్ తుపాకీతో కాల్చగా, కల్యాణ్, సుఖ్‌రామ్‌లకు గాయాలయ్యాయి. అనంతరం 2.74 కిలోల బంగారం, రూ.2.63 లక్షల నగదుతో ఉన్న సంచిని వారి నుంచి లాక్కుని పరారయ్యారు. ఈ దోపిడీకి ప్రణాళిక వేసిన ప్రధాన సూత్రధారి మహేంద్ర.. ఫిరోజ్‌తో కలిసి ఉప్పల్‌లోని ఓ బార్‌లో ఉండి దోపిడీని పర్యవేక్షించాడు. ఘటన అనంతరం సుమిత్, మనీశ్, మన్యాతో కలిసి మహేంద్ర నిర్మల్ మీదుగా కారులో పారిపోయాడు.
పట్టుబడింది ఇలా..
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజీల్లో బన్సీరామ్ తెల్ల చొక్కా ధరించి ఉండటాన్ని గుర్తించారు. దోపిడీకి ముందు రాజ్‌కుమార్ ఎక్కడెక్కడ తిరిగాడో పరిశీలించగా, ఆయా ప్రాంతాల్లో బన్సీరామ్ అతన్ని అనుసరించినట్టు తేటతెల్లమైంది. సరిగ్గా దోపిడీకి మూడు గంటల ముందు వాహనం నంబర్ ప్లేటును తీసేశాడని గుర్తించారు. దాని ఆధారంగా కొన్ని గంటల కిందటి ఫుటేజీలు తీసి వాహనం నంబరు గుర్తించారు. దానిపై చలానాలు ఉన్నాయేమోనని చూడగా, రామాయంపేట దగ్గర తెల్ల చొక్కాతో బన్సీరామ్ ట్రాఫిక్ కెమెరాకు దొరికాడు. ఈ వివరాల ఆధారంగా బన్సీరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, గుట్టు బయటపడింది. మహేంద్ర, సుమిత్, మనీశ్, మన్యా.. రాజస్థాన్, హరియాణా వెళ్లినట్టు భావిస్తున్న పోలీసులు వారి కోసం 15 బృందాలతో గాలింపు చేపట్టారు.