Telugu Global
Telangana

ఆ క్రెడిట్ మాదే.. సీతారామ ప్రాజెక్ట్ పై మొదలైన ఫైట్

బీఆర్ఎస్ హయాంలో పనులన్నీ పెండింగ్ లో పడ్డాయని, తమ ప్రభుత్వం వచ్చాక, కేవలం ఆరు నెలల్లోనే నిధులు విడుదలై ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైందని కాంగ్రెస్ నేతలంటున్నారు.

ఆ క్రెడిట్ మాదే.. సీతారామ ప్రాజెక్ట్ పై మొదలైన ఫైట్
X

ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని.. 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల మంటలు రాజేసింది. ఆ ప్రాజెక్ట్ ఘనత మాదంటే మాదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. "సీతారామ ప్రాజెక్ట్ నా గుండెకాయ" అని ఆనాడే కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తూ కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ వేశారు. ఖమ్మం నుంచి శాశ్వతంగా కరువుని పారద్రోలేందుకు ఈ ప్రాజెక్ట్ ని కేసీఆర్ మొదలు పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది పూర్తయినా.. ఆ ఘనత కేసీఆర్ దేనని చెప్పుకొచ్చారు కేటీఆర్. కేసీఆర్ మహా సంకల్పం నెరవేరిన రోజు ఇది అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

కాంగ్రెస్ కౌంటర్..

ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్వీట్ వేసింది. ఐదేళ్లు నత్తనడకన పనులు సాగాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని కాంగ్రెస్ చెబుతోంది. ప్రజా పాలన మొదలు కాగానే ఈ ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గత ప్రభుత్వ హయాంలో పనులన్నీ పెండింగ్ లో పడ్డాయని, తమ ప్రభుత్వం వచ్చాక, కేవలం ఆరు నెలల్లోనే నిధులు విడుదలై ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైందని కాంగ్రెస్ ట్వీట్ వేసింది.


గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సమయంలో బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడ్డాయి. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే, నియామక పత్రాలు చేతిలో పెట్టి ఆ ఘనత తనదేనని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఎవరికో పుట్టిన బిడ్డల్ని కాంగ్రెస్ తమ బిడ్డలేనని చెప్పుకుంటోందని కూడా ఘాటు వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఆ ఘనత తమదేనని బీఆర్ఎస్ నేతలంటున్నారు. తాము అధికారంలోకి వచ్చాకే పనులు జోరందుకున్నాయని కాంగ్రెస్ చెబుతోంది.

First Published:  27 Jun 2024 5:26 PM IST
Next Story