Telugu Global
Telangana

MLA poaching case:బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో ఈ నెల 2 న విచారణకు హాజరుకావాలని సంతోష్ ను సిట్ కోరింది.

MLA poaching case:బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు
X


నలుగురు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థ) బీఎల్ సంతోష్ ను విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి వి ఆనంద్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సిట్‌లోని అధికారుల‌లో ఒకరైన అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బి గంగాధర్ నవంబర్ 16వ తేదీన సంతోష్ కు బెంగళూరు నివాసంలో నోటీసు అందించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించిన‌ ఆరోపణలపై విచారణ నిమిత్తం నవంబర్ 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని సిట్ నోటీసులో సంతోష్‌ను కోరింది.

"ఈ నోటీసు యొక్క నిబంధనల ప్రకారం మీరు హాజరు కావడంలో విఫలమైతే, CrPC సెక్షన్ 41-A (3) (4) కింద మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుంది" అని నోటీసు పేర్కొంది.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సంబంధించి సంతోష్‌ నుంచి వాస్తవాలను తెలుసుకునేందుకు, సంతోష్‌ను ప్రశ్నించేందుకు సహేతుకమైన కారణాలు ఉన్నాయని సిట్ తన నోటీసులో పేర్కొంది.

ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి లు నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్ష వర్ధన్ రెడ్డిలతో జరిపిన సంభాషణల వీడియోలో సంతోష్ పేరు చాలాసార్లు వినిపించింది.

ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలకు తాను సన్నిహితుడనని చెప్పుకునే రామచంద్ర భారతి, ఉప ఎన్నికలకు ముందు తనతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావడం కోసం రోహిత్‌రెడ్డితో బేరసారాలు సాగించినట్లు వీడియోలు వెల్లడించాయి.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు తనకు పార్టీలోని అత్యున్నత వ్యక్తుల నుంచి క్లియరెన్స్‌ వచ్చిందని చెప్పిన రామచంద్ర భారతి రోహిత్‌రెడ్డితో పాటు బీజేపీలో చేరనున్న వారి పేర్లను అడగ్గా, బీజేపీ అగ్ర నేత‌లను కలిసే వరకు ఆ పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు రోహిత్ రెడ్డి. వ్యక్తిగతంగా.

హైదరాబాద్‌లో డీల్ కుదిరిన తర్వాత బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో సమావేశం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యేకు భారతి చెప్పినట్లు వీడియోల్లో ఉంది.

కాగా భవిష్యత్తులో ఎలాంటి నేరం చేయరాదని, కేసులో సాక్ష్యాలను తారుమారు చేయవద్దని సంతోష్ ను సిట్ అధికారి ఆదేశించారు. "మీరు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి బెదిరింపులు, ప్రేరేపణలు లేదా వాగ్దానాలు చేయరాదు" అని బీఎల్ సంతోష్ కు జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది.

అవసరమైనప్పుడు కోర్టుకు, కేసు దర్యాప్తుకు హాజరుకావాలని సంతోష్‌ను సిట్ ఈ నోటీసులో ఆదేశించింది.

దర్యాప్తు అధికారి, న్యాయస్థానం నుండి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని బిజెపి నాయకుడు సంతోష్ ను సిట్ కోరింది.

First Published:  19 Nov 2022 8:21 AM IST
Next Story