Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ లీక్ కేసు.. ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

ఖమ్మంకి చెందిన కారు డీలర్ సాయి లౌకిక్, అతడి భార్య సుస్మితలను ఈ మేరకు ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ లీక్ కేసు.. ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
X

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా తమ దర్యాప్తును ప్రారంభించింది. గ్రూప్-1 లీక్ ఘటనలో రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు తెలియడంతో.. ఈడీ కూడా కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. విదేశాల్లో ఉన్న కొంత మందికి క్వశ్చన్ పేపర్ అమ్మారని.. అక్కడి నుంచి డబ్బు అక్రమంగా నిందితులకు అందినట్లు అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఖమ్మంకు చెందిన భార్యభర్తలను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ జంట డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) క్వశ్చన్ పేపర్ కోసం అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఖమ్మం కోర్టులో వారి కస్టడీ కావాలని ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారుల కస్టడీ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. వారిద్దరినీ మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఖమ్మంకి చెందిన కారు డీలర్ సాయి లౌకిక్, అతడి భార్య సుస్మితలను ఈ మేరకు ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసి మానేసిన సుస్మిత.. గ్రూప్ -1 ఎగ్జామ్ రాసింది. ఈ క్రమంలో ఎగ్జామ్‌లో తప్పు బబ్లింగ్ చేసింది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. అప్పుడే కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ పీఏ ప్రవీణ్‌తో పరిచయం అయ్యింది. పలుమార్లు ప్రవీణ్‌కి కాల్ చేసి విషయాన్ని వివరించింది. అయితే, తన వద్ద డీఏఓ క్వశ్చన్ పేపర్ ఉందని.. కావాలంటే ఇస్తానని ప్రవీణ్ ఆఫర్ చేశాడు. అందుకు ఒప్పుకున్న ఆ జంట రూ.6 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.

అయితే, ఇప్పటికే సిట్ అధికారులు సాయి లౌకిక్, సుస్మితలకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సుస్మితకు చెందిన టీఎస్‌పీఎస్సీ హాల్ టికెట్, ఆ జంట కాల్ రికార్డులు, వారి వద్ద ఉన్న డీఏఓ క్వశ్చన్ పేపర్‌ను సేకరిస్తున్నారు. అలాగే సాయి లౌకిక్‌ బ్యాంకు స్టేట్మెంట్లను కూడా రెండు రోజుల్లో సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ జంటను ఈడీ అధికారులతో పాటు సిట్ అధికారులు కూడా లోతుగా విచారిస్తున్నారు. సాయి లౌకిక్ ఈడీ విచారణలో తాను రూ.6 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకోవడంతో అతడిపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నది.

First Published:  15 April 2023 7:28 AM IST
Next Story