అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే సిసోడియా అరెస్ట్ -కేసీఆర్
''ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అదానికి ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదు.''అని కేసీఆర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అదానీ స్కాం నుంచి, అదానీ కోసం మోడీ చేసిన వ్యవహారాల నుంచి ప్రజలను పక్కతోవపట్టించేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు.
ఈ మేరకు కేసీఆర్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. అందులో...
''ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఇది అదానికి ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదు.- బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు'' అని కేసీఆర్ పోస్టులో రాశారు.
మరో వైపు రౌస్ అవెన్యూ కోర్టు కోర్టు మనీష్ సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. సీబీఐ ఐదురోజుల కస్టడీ అడుగగా మార్చి 4 వరకు కస్టడీకి కోర్టు ఒప్పుకుంది. దీనికి ముందు సీబీఐ తరపు లాయర్ తన వాదనలు వినిపిస్తూ... తాము అడిగిన కీలక అంశాలపై వివరణ ఇవ్వకుండా సిసోడియా దాటవేశారని, అందువల్ల ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.
లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్లు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని చెప్పారు. లిక్కర్ పాలసీలో కమీషన్ను 5 నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారని సీబీఐ తరపు న్యాయవాది ఆరోపణలు చేశారు. కాగా తమ క్లైంట్ సిసోడియా సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నారని సిసోడియా తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.