సింగరేణి చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు.. కార్మికులకు రూ.1726 కోట్ల వేతన బకాయిలు చెల్లింపు
ఒక్కో కార్మికుడికి సగటున 4 లక్షల రూపాయల వరకు అందవచ్చని సింగరేణి డైరెక్టర్ బలరాం చెప్పారు. రెండు విడతలుగా ఈ మొత్తం కార్మికుల ఖాతాల్లో జమ చేస్తారు.
పండగల వేళ సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. 11వ వేతన ఒప్పందం కింద రావాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నెలరోజుల్లోగా ఈ బకాయిలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్ బలరాం ప్రకటించారు.
23 నెలల బకాయిలు.. రూ.1,726 కోట్లు
వేతన ఒప్పందం కింద 23 నెలలకు రావాల్సిన బకాయిలు రూ.1,726 కోట్లు ఉన్నట్లు సింగరేణి లెక్కలు కట్టింది. ఒక్కో కార్మికుడికి సగటున 4 లక్షల రూపాయల వరకు అందవచ్చని బలరాం చెప్పారు. రెండు విడతలుగా ఈ మొత్తం కార్మికుల ఖాతాల్లో జమ చేస్తారు.
సింగరేణి చరిత్రలోనే అత్యధికం
సింగరేణి చరిత్రలోనే అత్యంత పెద్ద మొత్తంలో చెల్లిస్తున్న వేతన బకాయిలు ఇవే. అందుకే పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ పేర్కొంది. శుక్రవారం నుంచి బకాయిల లెక్కింపు వ్యక్తిగతంగా ప్రారంభించారు.