సింగరేణి దేశంలోనే అగ్రశ్రేణి సంస్థ.. దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండమే : మంత్రి కేటీఆర్
సింగరేణి అంటే తెలంగాణకు కొంగు బంగారం. రాష్ట్రానికే వెలుగుల మణిహారం.. సింగరేణి అంటే ఒక కంపెనీ కాదు.. ఇది తెలంగాణకు భాగ్యరేఖ, జీవనాడి అని కేటీఆర్ అన్నారు.
బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి దేశంలోనే అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందుతోంది. సింగరేణి కార్మికులు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు సీఎం కేసీఆర్ వెంట నిలబడ్డారు. వలస పాలకులకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు సమ్మె చేస్తే.. 5 దక్షిణాది రాష్ట్రాల్లో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాంటి సింగరేణి సంస్థను అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.300 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..
సింగరేణి అంటే తెలంగాణకు కొంగు బంగారం. రాష్ట్రానికే వెలుగుల మణిహారం.. సింగరేణి అంటే ఒక కంపెనీ కాదు.. ఇది తెలంగాణకు భాగ్యరేఖ, జీవనాడి అని కేటీఆర్ అన్నారు. అలాంటి సంస్థను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సింగరేణి సంస్థకు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే.. నామినేషన్ మీద బొగ్గు గనులు ఇవ్వాలని కోరాము. కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని కేటీఆర్ అన్నారు. అదే గుజరాత్‌లోని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మాత్రం అడగ్గానే నాలుగు బొగ్గు గనులను ప్రధాని మోడీ రాసిచ్చారని మండిపడ్డారు.
సింగరేణికి కావాలంటే వేలంలో పాల్గొనండి అని చెబుతున్నారు. మొన్న గాలి మోటారులో వచ్చిన మోడీ.. సింగరేణిని అమ్మబోమని గాలి మాటలు చెప్పారని అన్నారు. ఇక్కడ అలా మాట్లాడి వెళ్లిన తెల్లారే నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారని మంత్రి దుయ్యబట్టారు. నిజంగా సింగరేణిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే చిత్త శుద్ది ఉంటే.. వేలం పెట్టిన ఆ నాలుగు గనులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మితే.. అక్కడ ఉండే వాళ్లు కొందరు మాట్లాడక పోవచ్చు. కానీ తెలంగాణతో గానీ, కేసీఆర్‌తో గానీ పెట్టుకుంటే మేం విడిచిపెట్టమని ప్రధాని మోడీని హెచ్చరించారు. సింగరేణిని పొరపాటున కూడా అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్గిగుండం అవుతుందని చెప్పారు.
కాంగ్రెస్ వాళ్లు ఆకాశంలో స్పెక్ట్రమ్ కూడా వదల్లేదు...
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తెలంగాణకు వచ్చింది. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని ఆమె కూడా అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ టూ జెడ్ అవినీతే అని చెప్పారు. వాళ్లు ఆకాశంలోని స్పెక్ట్రమ్‌ను, పాతాళంలోని బొగ్గును కూడా విడిచిపెట్టలేదని మండిపడ్డారు. అలాంటి వాళ్లొచ్చి ఇవ్వాళ మనకు అవినీతి గురించి లెక్చర్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగానలో ఉన్న పథకాలు ఆ రెండు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర రైతులు తెలంగాణలో మమ్మల్ని కలుపుకోండని అడుగుతున్నారు. ఇవ్వాళ తెలంగాణ పథకాలు దేశమంతా కావాలని కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను. కేసీఆర్ మీ బిడ్డ.. పార్టీ పేరు మారింది కానీ.. పార్టీ డీఎన్ఏ మారలేదని కేటీఆర్ చెప్పారు. మీరు మంచి తీర్పు ఇవ్వండి. కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కేటీఆర్ కోరారు.
పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ముఖ్యం..
దేశ సరిహద్దుల్లో ఆర్మీ నిరంతరం నిఘా ఉంచడం వల్లే మనం సురక్షితంగా ఉన్నాము. ఇక దేశంలో అంతర్గత శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా చాలా గొప్పవారని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు ఎంత పని చేసినా శభాష్ అనే వారు చాలా తక్కువగా ఉంటారని ఆయన చెప్పారు. రామగుండంలో కొత్త పోలీస్ కమిషనరేట్‌ను హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యమని కేటీఆర్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ రాజ్యం వస్తుందని, మత ఘర్షణలు చెలరేగుతాయని చాలా మాట్లాడారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని మంత్రి చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సురక్షితమైన రాష్ట్రంగా మారిందని అన్నారు. పోలీసు వ్యవస్థపై విశ్వాసం నింపేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య ప్రాణాలు అర్పించారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కిష్టయ్య కుటుంబంలోని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నామని అన్నారు. కిష్టయ్య కుమార్తె ఇప్పుడు డాక్టర్ అయ్యి.. కరీంనగర్‌లోని ఒక బస్తీ దవాఖానలో పని చేస్తోందని కేటీఆర్ చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం పొల్యుషన్ అలవెన్స్ ఇస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఇచ్చిన తర్వాతే ఇతర రాష్ట్రాలు అనుసరించాయని కేటీఆర్ గుర్తు చేశారు.