Telugu Global
Telangana

సింగరేణి ఎన్నికలు వాయిదా

యాజమాన్యం తరపు వాదనలు విన్న డివిజన్ బెంచ్ ఎన్నికలు నెల రోజుల పాటు వాయిదా వేసింది.

సింగరేణి ఎన్నికలు వాయిదా
X

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సింగరేణి ఎన్నికలను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. దీనిపై తాజాగా బుధవారం విచారణ జరిగింది.

సింగరేణి విస్తరించి ఉన్న జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మావోయిస్టు ప్రాబల్యం ఉన్నవిగా చెప్పింది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా తగినంత భద్రత కల్పించలేదని తెలిపింది. యాజమాన్యం తరపు వాదనలు విన్న డివిజన్ బెంచ్ ఎన్నికలు నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని.. నవంబర్ 30లోగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కార్మిక శాఖను ఆదేశించింది.

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో ఇప్పటికే కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు కానున్నది. తాజాగా మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నది. కాగా, సింగరేణికి ఎన్నికలు నిర్వహించక పోవడంతో అన్ని కార్మిక సంఘాలకు సమానంగా గుర్తింపు ఇస్తామని ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్మిక సంఘాలు కూడా ఇప్పుడే ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం తెలియజేయలేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణి ఎన్నికలు జరుగనున్నాయి.

First Published:  11 Oct 2023 12:39 PM IST
Next Story