సుస్థిర లాభాల్లో సింగరేణి సంస్థ.. మంత్రి కిషన్ రెడ్డి చెప్పినవి అన్నీ అబద్దాలే!
బ్యాంకు డిపాజిట్లు, రావల్సిన బకాయిలు కలిపి రూ.27 వేల కోట్ల ఆర్థిక పరిపుష్టిని సింగరేణి సంస్థ కలిగి ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నది.
సింగరేణి సంస్థ అప్పుల పాలైందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని.. ప్రతీ ఏడాది సుస్థిరమైన లాభాలను అర్జిస్తోందని యాజమాన్యం ప్రకటించింది. సింగరేణికి భారీగా అప్పులు ఉన్నాయని, జీతాలకు కూడా నిధులు లేవని చెప్పడం సత్య దూరమని సంస్థ ప్రకటించింది. సింగరేణి సంస్థకు బ్యాంకులు, ఇతర సంస్థల్లో కలిపి రూ.11,665 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. వీటి వల్ల రూ.750 కోట్లకు పైగా రాబడి వస్తోందని చెప్పింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సింగరేణి వద్ద బొగ్గును కొన్న వినియోగదారుల నుంచి రూ.15,500 కోట్ల బకాయిలు రావల్సి ఉన్నదని చెప్పింది. బ్యాంకు డిపాజిట్లు, రావల్సిన బకాయిలు కలిపి రూ.27 వేల కోట్ల ఆర్థిక పరిపుష్టిని సింగరేణి సంస్థ కలిగి ఉన్నదని పేర్కొన్నది. సింగరేణి సంస్థకు రూ.12వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరమని సంస్థ విచారం వ్యక్తం చేసింది.
సోలార్ విద్యుత్ కేంద్రాల కోసం చేసిన రూ.472 కోట్ల అప్పును ఇప్పటికే తీర్చి వేశామని, థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం చేసిన రూ.5,300 కోట్ల అప్పులో.. రూ.2,800 కోట్లు మాత్రం చెల్లించాల్సి ఉందన్నారు. సింగరేణి సంస్థకు ఉన్న అప్పు అదొక్కటేనని వెల్లడించింది. బకాయిలు సరైన సమయానికి వస్తే ఆ అప్పు కూడా తీరిపోతుందని పేర్కొంది.
జీతాల చెల్లింపు కోసం ప్రతీ నెల అప్పు చేస్తున్నామన్నది సత్య దూరమని సంస్థ పేర్కొన్నది. ప్రతీ నెల 3వ తేదీన కచ్చితంగా వేతనాలు చెల్లిస్తున్నామని, అందు కోసం ఎలాంటి అప్పులు చేయడం లేదని స్పష్టం చేసింది. సింగరేణి ప్రతీ ఏడాది తమ ఆర్థిక లావాదేవీల నివేదికను వెలువరిస్తున్న విషయాన్ని కూడా అధికారులు గుర్తు చేశారు. ఈ నివేదికను కాగ్ కూడా పరిశీలించి.. 'నిల్ కామెంట్స్' అని పేర్కొన్నదని తెలిపారు. సింగరేణి సంస్థకు సంబంధించిన సమాచారం కావాలంటే కంపెనీ సెక్రటరీ లేదా ఇన్ఫర్మేషన్ అధికారిని సంప్రదించవచ్చని ప్రకటనలో తెలిపింది.
సింగరేణి సంస్థ రూ.32వేల కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోకి కూడా వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఒడిషాలో వచ్చే నెల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనున్నది. ఇక ఆర్థికంగా ఎంతో పరిపుష్టిగా ఉన్న సంస్థ.. ప్రతీ ఏడాది కార్మికులకు బోనస్‌లు కూడా ఇస్తోంది. తెలంగాణ రాక ముందు సగటున ఒక కార్మికునిపై రూ.1.15 లక్షలు సంక్షేమానికి ఖర్చు చేయగా.. ఇప్పుడు రూ.3.15 లక్షలు ఖర్చు చేస్తున్నది. ఈ విషయాలన్నీ కంపెనీ అప్పుల్లో లేవనే విషయాన్నే తెలియజేస్తోంది. కానీ కావాలనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే యత్నం చేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.