Telugu Global
Telangana

ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ పోస్టింగ్‌ను హోల్డ్‌లో పెట్టిన కేంద్ర ప్రభుత్వం

శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ పోస్టింగ్‌ను హోల్డ్‌లో పెట్టిన కేంద్ర ప్రభుత్వం
X

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) సీఎండీగా ఎంపికైన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన పోస్టింగ్‌ను ప్రస్తుతానికి హోల్డింగ్‌లో పెట్టినట్లు తెలిపింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు చేసిన ఫిర్యాదు మేరకే శ్రీదర్ పోస్టింగ్‌ను హోల్డ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా యూనియన్ స్టీల్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. మరోవైపు శ్రీధర్ కూడా వ్యక్తిగతంగా.. ఎంపీ బాబూరావు చేసిన ఆరోపణలపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే మరి కొన్నింటిపై ఉక్కు శాఖ విచారణ చేస్తోంది. విచారణ పూర్తి అయ్యే వరకు ప్రస్తుతం ఎన్ఎండీసీకి ఇంచార్జి సీఎండీగా వ్యవహరిస్తున్న అమితావా ముఖర్జీని వరకు కొనసాగిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఇప్పటికే అమితావా ముఖర్జీ పదవీ కాలాన్ని మార్చిలో అగస్టు వరకు పొడిగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నవంబర్ వరకు పొడిగించారు.

సింగరేణి కాలరీస్‌కు 2014 డిసెంబర్ నుంచి శ్రీధర్ సీఎండీగా పని చేస్తున్నారు. 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన శ్రీధర్.. సంస్థను లాభాల బాట పట్టించడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్ఎండీసీ టాప్ పోస్టుకు పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందులో మంచి ప్రతిభ కనపరిచిన శ్రీధర్‌ను సీఎండీగా ఎంపిక చేస్తున్నట్లు మార్చిలో ప్రకటించింది.

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు గతంలోనే ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియాకు శ్రీధర్‌పై పలు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఈపీసీ, ఇతర కాంట్రాక్టులను కట్టబెట్టడంలో శ్రీధర్ అక్రమాలకు పాల్పడ్డారని, తనకు అనుకూలమైన వారికే వాటిని కేటాయించారని లేఖలో పేర్కొన్నారు. సింగేణి సంస్థకు చెందిన సర్‌ప్లస్ క్యాష్‌ను నిబందనలకు విరుద్దంగా ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు కూడా లేఖలో ఆరోపించారు. విజిలెన్స్ అధికారి నియామకంలో అక్రమం జరిగిందని.. అలాగే శ్రీరాంపూర్ ప్రాంతంలో డీజిల్ కుంభకోణంపై శ్రీధర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలతో కోల్ బెల్ట్ ఏరియాలో అభివృద్ధి పనులకు, స్థానికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్భలంతో ఆ నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు కూడా శ్రీధర్‌పై బాబూ రావు ఆరోపిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్‌కు శ్రీదర్ సన్నిహితంగా ఉండటం వల్లే ఆయనపై బీజేపీ ఎంపీ ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని.. సంస్థను లాభాల బాట పట్టించిన అధికారిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని సంస్థకు చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు.

First Published:  27 July 2023 5:10 AM
Next Story