Telugu Global
Telangana

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం చేయలేనిది తెలంగాణ చేసి చూపెట్టింది : ఇంద్ర శేఖర్ సింగ్

రెండేళ్లలో మిషన్ భగీరథను పూర్తి చేశారంటే నమ్మశక్యంగా కూడా లేదు. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం చేయలేనిది తెలంగాణ చేసి చూపెట్టింది : ఇంద్ర శేఖర్ సింగ్
X

'ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణ.. ఇవ్వాళ ఇంటింటికీ పైపులతో మంచి నీటిని సరఫరా చేసుకోగలుగుతోంది. మోటార్లు వేస్తే కాని పంటలు పండించలేని స్థితి నుంచి దక్షిణాదికే ధాన్యాగారంగా మారిపోయింది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ మిషన్ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్లాస్టిక్ పైపుల కంపెనీ యాజమాన్యాల కడుపు నింపడానికే కానీ.. గొంత తడపడానికి కాదనే విధంగా జల్ జీవన్ మిషన్ నడుస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం రెండేళ్లలోనే నీటి ఎద్దడి నుంచి బయటపడింది. ఇక్కడ అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి'.. ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడో చెప్పినవి కావు. నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, స్వతంత్ర ఆగ్రీ పాలసీ విశ్లేషకుడు, నీటిపారుదల, వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఇంద్రశేఖర్ సింగ్ స్వయంగా రాసుకొచ్చిన విషయాలు.

ఏవో నాలుగు పత్రికలు చదివి, నలుగురు చెప్పింది ఫోన్లో విని రాసిన విషయాలు కావివి. జహీరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా చివరన ఉన్న అశ్వారావుపేట వరకు రాష్ట్రమంతటా 13 రోజుల్లో దాదాపు 2,500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత తన అనుభవాలను, విశేషాలను రాసుకొచ్చారు. 'ది వైర్'లో ఇంద్ర శేఖర్ సింగ్ రాసిన విశేషాలను ప్రచురించారు. ఇందులో తెలంగాణ నీటిపారుదలకు సంబంధించి అనేక విషయాలను ఆయన వెల్లడించారు.

తెలంగాణలో ఇంటింటికీ పైపుల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు స్వయంగా కేంద్ర మంత్రే పార్లమెంటులో ప్రకటించారు. ఆ ప్రకటన చూసి నేను ఆశ్చర్యపోయాను. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా.. ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఇంటింటికీ మంచి నీరు అందించలేదు. మరి నిన్న కాక మొన్న పుట్టిన తెలంగాణలో ఎలా సాధ్యమైందని నాకు అనిపించిందని ఇంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. అందుకే స్వయంగా తానే పరిశీలించాలని భావించి తెలంగాణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. జహీరాబాద్ జిల్లాలోని పొడి నేలల నుంచి తన ప్రయాణం మొదలు పెట్టానని.. ఇక్కడ ట్యాంకు నీళ్లతో వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ఇక ఖమ్మం జిల్లా చాలా పచ్చగా కనపడిందని.. ఈ జిల్లాలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. నాగార్జునసాగర్ కాల్వ స్థిరీకరణ జరగడంతో నీళ్లు అన్ని పంటలకు అందుతున్నాయని అన్నారు.

మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్‌ను కూడా సందర్శించాను. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను చూశాను. వరంగల్, కరీంనగర్‌లో ఉన్న చెరువులు, కుంటలను కూడా తన పర్యటనలో పరిశీలించానని చెప్పారు. గోదావరిలో దిగాను.. మున్నేరులో ఈత కొట్టాను.. అలాగే కొన్ని వందల గ్రామాల్లో నీటిని రుచి చూశారని అన్నారు. రామప్ప దేవాలయాన్ని దర్శించుకోవడమే కాకుండా.. అక్కడ ఉన్న భారీ చెరువును చూసి ఆశ్చర్యపోయాను.

తాగునీటి కోసం తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ.. సాగునీటి కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర నీటి రంగానికి గుండె లాంటివని ఆయన పొగిడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాలకు సాగునీరు అందుతోందన్న విషయాన్ని తెలుసుకున్నాను. రంగనాయక లిఫ్ట్ పంప్ స్టేషన్ పరిశీలించాను. ఇదొక ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం. 150 అడుగుల దిగువన సర్జ్ పూల్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని పంప్ చేయడం ఓ అద్బుతం. అలాగే వీటికి అనుగుణంగా నిర్మించిన రిజర్వాయర్లను కూడా పరిశీలించాను. వాటి విశేషాలు తెలుసుకొని ఆశ్చర్యపోయానని ఇంద్ర శేఖర్ సింగ్ చెప్పారు.

మిషన్ భగీరథకు సీఎం కేసీఆర్ 1996-97లోనే రూపకల్పన చేసిన విషయం తెలుసుకున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన సిద్ధిపేట నియోజకవర్గంలో ఈ ప్రాజెక్ట్ భగీరథను అమలు చేశారు. లోయర్ మానేర్ డ్యామ్ నుంచి రూ.100 కోట్ల వ్యయంతో 180 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించారు. అప్పట్లోని ఈ ప్రాజెక్టే ఇప్పుడు మిషన్ భగీరథగా రాష్ట్రమంతటా అమలు జరిగిందని ఆయన చెప్పారు. గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీలు, పైపు లైన్లు, పంపింగ్ స్టేషన్ల ద్వారా నీళ్లు రాష్ట్ర మంతటా పారుతున్న విషయం తనకు అబ్బురపరిచిందని అన్నారు.

తన పర్యటనలో గజ్వేల్ సర్పంచ్ శేఖర్ పటేల్‌ను కలిశానని సింగ్ చెప్పారు. గతంలో ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేదని.. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఇంటి వద్ద ఒకరు ఎప్పుడూ కాచుకొని ఉండేవారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ప్రతీ ఊరిలో భారీ వాటర్ ట్యాంకు నిర్మించారని.. దాంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోందని శేఖర్ పటేల్ చెప్పారు.

ఇక తెలంగాణలో ఎక్కువగా మోటార్లు, బోరు బావుల ద్వారా వ్యవసాయం జరిగేది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు సాగు నీటి కరువు ఉండేది. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఎన్నో గ్రామాలకు సాగు నీరు అందుతోంది. అంతే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరిగినట్లు తెలుస్తున్నదని ఇంద్రశేఖర్ సింగ్ చెప్పుకొచ్చారు.

రామప్ప చెరువును చూసిన తర్వాత తెలంగాణ వాటర్ రీసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్ రావును కలిశాను. ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. కేసీఆర్ మొదటి నుంచి నీళ్లపై ఎక్కువ దృష్టి పెట్టిన విషయాన్ని కూడా వివరించారు. ఇప్పుడు తాను పని చేస్తున్నది స్వతంత్ర సంస్థ అని.. దీనికి రాజకీయాలతో పని లేదని ప్రకాశ్ రావు చెప్పారన్నారు.

ఈ విషయాలన్నీ పరిశీలించిన తర్వాత నీటి విషయంలతో తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అర్థం అవుతోంది. ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించడానికి కేవలం రెండేళ్లలో మిషన్ భగీరథను పూర్తి చేశారంటే నమ్మశక్యంగా కూడా లేదు. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దీని వెనుక సీఎం కేసీఆర్ ముందు చూపు ఉన్నట్లు ప్రకాశ్ రావు చెప్పారని అన్నారు.

మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించింది ప్రధాని మోడీనే.. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న కృషిని పార్లమెంటులో అభినందించింది కూడా ఆయనే.. కానీ మిషన్ భగీరథకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధులు ఇవ్వడంలో పక్షపాతం చూపించింది. వీటికి అయిన ఖర్చులో 99 శాతం తెలంగాణ ప్రభుత్వమే వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి పూర్తి చేసిందని ప్రకాశ్ రావు చెప్పారన్నారు. ఇంద్రశేఖర్ సింగ్ రాసిన ఆర్టికల్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కింది లింక్ నుంచి పూర్తి రిపోర్ట్ చదువవచ్చు.

First Published:  4 March 2023 11:53 AM GMT
Next Story