ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరే మంచి సీఎంలు.. మిగతా వాళ్లు బ్రోకర్లు
తాను చాలామంది సీఎంలను చూశానని కానీ ఎన్టీఆర్, కేసీఆర్ లాగా ఇంకెవరూ ప్రజలకు మంచి చేయాలని తపించలేదని వారిద్దరే మంచివారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.
తెలుగు ప్రజలకోసం పని చేసిన ముఖ్యమంత్రుల్లో ఇద్దరే మంచివారని కితాబిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను చాలామంది సీఎంలను చూశానని కానీ ఎన్టీఆర్, కేసీఆర్ లాగా ఇంకెవరూ ప్రజలకు మంచి చేయాలని తపించలేదని వారిద్దరే మంచివారని చెప్పారు. మిగతా వాళ్లంతా బ్రోకర్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఈ వ్యాఖ్యలు చేసేందుకు తానేమీ ఇబ్బంది పడటం లేదని చెప్పారు. ములుగు జిల్లాకోసం అహర్నిశలు పనిచేసింది సీఎం కేసీఆరేనని అన్నారు ఎర్రబెల్లి.
ఆ తప్పులు మాపై రుద్దొద్దు..
ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీల శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావుతో కలసి పాల్గొన్నారు దయాకర్ రావు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు కేవలం పదేళ్లలోనే అవుతాయా? అని ప్రశ్నించారు. అన్నింటికీ ఓపిక అవసరమన్నారు. గిరిజనులతో పాటు అర్హులైన గిరిజనేతరులకు కూడా పోడుపట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం అందుకు అడ్డంకిగా ఉందన్నారు ఎర్రబెల్లి.
ములుగు సమస్యలను సభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సీతక్కపై పరోక్షంగా సెటైర్లు వేశారు మంత్రి ఎర్రబెల్లి. సమస్యలు ఇప్పుడే వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారని, వారి పాలనలో ఏం చేశారని నిలదీశారు. తెలంగాణలో 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామంటూ వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్, చత్తీస్ ఘడ్ లో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసింది, చేసేది కేసీఆరేనని స్పష్టం చేశారు ఎర్రబెల్లి. మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. పెన్షన్లను పెంచడంతోపాటు.. రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు మంత్రి.