Telugu Global
Telangana

రైలు ఘనత మాది, కాదు మాదే.. సిద్ధిపేటలో రచ్చ రచ్చ

కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా రూ.640 కోట్లు వెచ్చించి భూసేకరణ, ఇతర పనులు పూర్తి చేశామని ముమ్మాటికీ ఈ ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు హరీష్ రావు. అలాంటిది ప్రారంభోత్సవంలో కేసీఆర్ ఫొటో కూడా ఏర్పాటు చేయలేదని బీజేపీ నేతలపై మండిపడ్డారు.

రైలు ఘనత మాది, కాదు మాదే.. సిద్ధిపేటలో రచ్చ రచ్చ
X

సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్ కి తొలిరైలు బయలుదేరింది. అయితే ఆ రైలు తెచ్చింది మేమంటే మేమంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవ జరిగింది. సిద్ధిపేట రైల్వే స్టేషన్లో బ్యానర్లు చిరిగాయి, ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి, ఎల్ఈడీ స్క్రీన్ లు పడిపోయాయి. కాసేపు రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. రెండు పార్టీల కార్యకర్తల తోపులాటలతో హడావిడి జరిగింది.

ఆ ఘనత మాది..

సిద్దిపేట జిల్లా ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం, రైలు కల సాకారం.. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతలేనని చెప్పారు మంత్రి హరీష్ రావు. 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్‌ సిద్దిపేట-కరీంనగర్‌ రైలు మార్గాల కోసం ప్రతిపాదనలు పంపించారని గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రవాటా విడుదల చేయడానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇష్టపడలేదని, తొమ్మిదేళ్ల తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తన ప్రతిపాదనను తానే ఆమోదించుకోవాల్సి వచ్చిందని వివరించారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా రూ.640 కోట్లు వెచ్చించి భూసేకరణ, ఇతర పనులు పూర్తి చేశామని ముమ్మాటికీ ఈ ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు హరీష్ రావు. అలాంటిది ప్రారంభోత్సవంలో కేసీఆర్ ఫొటో కూడా ఏర్పాటు చేయలేదని బీజేపీ నేతలపై మండిపడ్డారు.


సిద్ధిపేట స్టేషన్లో గొడవ జరుగుతుండగానే.. ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు జెండా ఊపి రైలుని ప్రారంభించారు. ప్రధాని మోదీ నిజామాబాద్‌ నుంచి వర్చువల్‌ గా ఈ రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదే రైలులో మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వేర్వేరు బోగీల్లో ప్రయాణించడం విశేషం.

First Published:  4 Oct 2023 7:40 AM IST
Next Story