Telugu Global
Telangana

సిద్ధిపేటలో హాఫ్ మారథాన్.. హరీష్ రావు సెల్ఫీల సందడి

సిద్ధిపేట హాఫ్ మారథాన్ కు అనూహ్య స్పందన వచ్చింది. మారథాన్ కు వచ్చిన యువత మంత్రి హరీష్ రావుతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

సిద్ధిపేటలో హాఫ్ మారథాన్.. హరీష్ రావు సెల్ఫీల సందడి
X

రన్నింగ్‌ అనేది మన దినచర్యలో ఒక భాగం కావాలని సూచించారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యంగా ఉండేందుకు పరుగు ఉపయోగపడుతుందని తెలిపారు. సిద్ధిపేటలో హాఫ్ మారథాన్ రన్ ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌ లో ఆయన ప్రారంభించారు. ప్రతి ఏడాది హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తామని, ప్లాస్టిక్ రహిత మారథాన్ నిర్వహించడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. మారథాన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సిద్ధిపేట మున్సిపాల్టీ తరపున మొక్కలను బహూకరించారు.


క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధిపేట వేదికగా మారిందని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట సరికొత్త ఆవిష్కరణ హాఫ్‌ మారథాన్‌ అని తెలిపారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన సిద్ధిపేట పట్టణాన్ని స్పోర్ట్స్‌ హబ్‌ గా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో ముందుకు పోతున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్ పోటీలు, వాలీబాల్, ఫుట్‌ బాల్ పోటీల సెలెక్షన్స్‌ కు, క్రికెట్ సెలెక్షన్స్‌ జరిగాయని చెప్పారు. జాతీయ స్థాయిలో హ్యాండ్‌ బాల్ పోటీలకు సిద్దిపేట వేదికైందని వెల్లడించారు.

సిద్ధిపేట హాఫ్ మారథాన్ కు అనూహ్య స్పందన వచ్చింది. మారథాన్ కు వచ్చిన యువత మంత్రి హరీష్ రావుతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. పెద్ద పెద్ద పట్టణాల్లోనే మారథాన్ లు జరుగుతుంటాయని, సిద్ధిపేటలో కూడా ఈ మారథాన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. యువత స్పందన బాగుందన్నారు. అందులోనూ ప్లాస్టిక్ రహితంగా ఈ మారథాన్ నిర్వహించడం శుభపరిణామం అని చెప్పారు హరీష్ రావు.

First Published:  6 Aug 2023 11:41 AM IST
Next Story