Telugu Global
Telangana

నకిలీ నోట్ల అన్నా చెల్లెళ్లు.. 2 వేల నోటుని మాత్రం వదిలేశారు..

వీరు ఎక్కువగా 100, 200 నోట్లే ముద్రించేవారు. 500 రూపాయల ప్రింటింగ్ అప్పుడప్పుడు చేసేవారు. 2వేల నోటుని మాత్రం ముద్రించేవారు కాదు.

నకిలీ నోట్ల అన్నా చెల్లెళ్లు.. 2 వేల నోటుని మాత్రం వదిలేశారు..
X

నకిలీనోట్ల చెలామణి ముఠాలు అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడుతూనే ఉంటాయి. స్నేహితులు, విద్యార్థులు, ఎక్కడెక్కడో పరిచయం అయిన పాత నేరస్తులు ముఠాగా ఏర్పడి నకిలీనోట్లు చెలామణి చేస్తుంటారు. అయితే ఈ ముఠాలో కుటుంబ సభ్యులున్నారు. సొంత అన్న, చెల్లెలు నకిలీనోట్లను ముద్రిస్తున్నారు. అన్న రమేష్ బాబు ఒకటో తరగతి చదివి ఆపేశాడు, మహారాష్ట్ర నుంచి వలస వచ్చి హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రమేష్ బాబు చెల్లెలు రామేశ్వరి. ఈమె కూడా హైదరాబాద్ లోనే ఉంటోంది. వైద్య విద్య చదువుతోంది. కరోనా టైమ్‌లో రమేష్ బాబుకి ఉపాధి దెబ్బతినడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గం వెదికాడు. చెల్లెలితో కలసి పథకం పన్నాడు. అన్న - చెల్లెలు నకిలీ నోట్లు చెలామణి మొదలుపెట్టారు.

యూట్యూబ్‌లో చూసి..

యూట్యూబ్‌లో నకిలీనోట్లు తయారు చేయడం ఎలా అనే వీడియోలు చూశారు అన్న,చెల్లెలు. దాన్ని అమలులో పెట్టారు. ఢిల్లీ వెళ్లి ప్రింటర్లు, ఇంక్ తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ఇంటికి దగ్గరే ఓ గదిని అద్దెకు తీసుకుని కుటీర పరిశ్రమలా ప్రింటింగ్ మొదలుపెట్టారు. రూ.100, రూ.200, అప్పుడప్పుడూ రూ.500 ప్రింట్ చేస్తుండేవారు. మొదట్లో వీరిద్దరే వీటిని మార్కెట్లో చెలామణి చేసేవారు. ఆ తర్వాత మరింత దుర్భుద్ధి పుట్టింది. అసలు నోట్లకు, నకిలీ నోట్లను మార్పిడి చేయడం అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలో దొరికిపోయారు.

2వేల నోట్లకు దూరం..

ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో ఏజెంట్లను పెట్టుకుని నకిలీనోట్లు చెలామణి ప్రారంభించారు అన్న, చెల్లెలు. అయితే వీరు చేసిన తెలివైన పని ఏంటంటే.. 2 వేల నోట్ల జోలికి వెళ్లకపోవడం. సహజంగా ఎవరైనా 2 వేల రూపాయల నోటు ఇస్తే పట్టి పట్టి చూస్తారు. కానీ వీరు ఎక్కువగా 100, 200 నోట్లే ముద్రించేవారు. 500 రూపాయల ప్రింటింగ్ అప్పుడప్పుడు చేసేవారు. 2 వేల నోటుని మాత్రం ముద్రించేవారు కాదు. కానీ ఎక్కడో ఓ చోట తప్పు చేసినవారు దొరికిపోక తప్పదు. అలా వీరు కూడా దొరికిపోయారు.

200 రూపాయల నోటు పట్టించింది..

ఇటీవల రామాంతపూర్‌కి చెందిన అంజయ్య అనే వ్యక్తి వీరికి పరిచయం అయ్యాడు. అతని వద్ద 50 వేల రూపాయలు అసలు నోట్లు తీసుకుని, లక్షా 30 వేల రూపాయలు నకిలీ నోట్లు ఇచ్చారు. అయితే అంజయ్య చేసిన తప్పుకి అన్న, చెల్లెలు కూడా దొరికిపోయారు. నకిలీ నోట్లలో అప్పటికే 40 వేల రూపాయలు మార్చిన అంజయ్య, సింకింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అరటిపండ్లు కొని నకిలీ 200 రూపాయల నోటు ఇచ్చాడు. షాపు యజమానికి అనుమానం రావడంతో.. అంజయ్య పారిపోవాలని చూశాడు. దీంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీగలాగితే డొంక కదిలింది. అన్న, చెల్లెలు పట్టుబడ్డారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి వీరు కరెన్సీ నోట్ల ప్రింటింగ్ మొదలుపెట్టారని తెలుసుకుని పోలీసులు షాకయ్యారు.

First Published:  21 Sept 2022 4:40 AM GMT
Next Story