Telugu Global
Telangana

ఎస్సై, కానిస్టేబుల్ అర్హత మార్కులు తగ్గింపు.. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన‌

ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాసిన వారికి కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను తగ్గిస్తూ ఈ రోజు కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.

ఎస్సై, కానిస్టేబుల్ అర్హత మార్కులు తగ్గింపు.. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన‌
X

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత మార్కులను తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రిలిమ్స్ పరీక్షల అర్హత మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్కులను తగ్గిస్తామని ఆయన ప్రకటించారు.

గతంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం అర్హత మార్కులు వస్తే.. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వారు.కానీ ఇటీవల విడుదల చేసి నోటిఫికేషన్లో అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలని పేర్కొన్నారు.

పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహించారు. అయితే తమకు అన్యాయం జరిగిందంటూ ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 40 శాతంగా ఉన్న ఓసీ అభ్యర్థులకు 10 శాతం సడలింపు ఇచ్చి, బీసీ అభ్యర్థులకు కూడా 5 శాతం రిజర్వేషన్ సడలింపు ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి సడలింపు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

దీనిపై కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్కులను తగ్గిస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీ అభ్యర్థులకు అర్హత మార్కుల తగ్గింపుపై క్లారిటీ లేదు.

First Published:  12 Sept 2022 2:09 PM IST
Next Story