Telugu Global
Telangana

కామారెడ్డిలో షాకింగ్ రిజల్ట్.. కేసీఆర్, రేవంత్‌పై వెంకటరమణారెడ్డి విజయం

కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఇక్కడ ఏ అభ్యర్థికి స్పష్టమైన‌ ఆధిక్యం కనిపించలేదు. ఒక్కో రౌండ్‌లో ఒక్కొక్కరు ఆధిక్యం చూపుతూ వచ్చారు. చివరికి ఇక్కడి నుంచి ఎవరు గెలుస్తారా..? అని అందరూ ఆసక్తితో ఎదురుచూశారు.

కామారెడ్డిలో షాకింగ్ రిజల్ట్.. కేసీఆర్, రేవంత్‌పై వెంకటరమణారెడ్డి విజయం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన కామారెడ్డి ఫలితం వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తారా..? లేదా రేవంత్ రెడ్డి గెలుస్తారా..? అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. బొటాబొటీ మెజారిటీతో కాదు.. ఏకంగా 6 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఘన విజయం సాధించడం గమనార్హం.

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అందరి చూపు కామారెడ్డి పైనే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తమ సంప్రదాయ స్థానాలైన గజ్వేల్, కొడంగల్‌లతో పాటు రెండో స్థానంగా కామారెడ్డి నుంచి బరిలో దిగారు. దీంతో కామారెడ్డిలో రేవంత్‌పై కేసీఆర్ గెలుస్తారా..? లేదంటే కేసీఆర్‌పై రేవంత్ గెలుస్తారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.

కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఇక్కడ ఏ అభ్యర్థికి స్పష్టమైన‌ ఆధిక్యం కనిపించలేదు. ఒక్కో రౌండ్‌లో ఒక్కొక్కరు ఆధిక్యం చూపుతూ వచ్చారు. చివరికి ఇక్కడి నుంచి ఎవరు గెలుస్తారా..? అని అందరూ ఆసక్తితో ఎదురుచూశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు.

ఏదో గెలిచారులే అన్నట్లు కాకుండా ఏకంగా 6 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడి నుంచి రెండవ స్థానంలో కేసీఆర్ నిలువగా, రేవంత్ రెడ్డి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.

విజయం నాదేనని ముందే చెప్పిన వెంకటరమణారెడ్డి

కామారెడ్డి నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. సర్వే సంస్థలు కూడా తానే గెలుస్తాయని పేర్కొన్నట్లు చెప్పారు. రెండు, మూడు స్థానాల గురించి అసలు ఆలోచించడం లేదన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లే ఫలితం వచ్చింది. వెంకటరమణారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గెలిచి రాష్ట్ర ప్రజలందరినీ ఆశ్చర్యపరిచారు.

స్థానికతకే పట్టం

బడా నాయకులైన కేసీఆర్, రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేసినా.. ప్రజలు చివరికి స్థానికతకే పట్టం కట్టారు. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, రేవంత్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడు అయినప్పటికీ వారిని ప్రజలు పట్టించుకోలేదు. స్థానికంగా ఉండే తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటే స్థానికుడే అయి ఉండాలని భావించి వెంకటరమణారెడ్డికి పట్టం కట్టారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రజలందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పొచ్చు.

First Published:  3 Dec 2023 5:20 PM IST
Next Story