Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీ నాయకులకు షాక్.. క్రమశిక్షణ, ఐక్యత కమిటీని నియమించనున్న అధిష్టానం?

రాష్ట్ర బీజేపీలో ఉన్న అనైక్యత, విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ బీజేపీ నాయకులకు షాక్.. క్రమశిక్షణ, ఐక్యత కమిటీని నియమించనున్న అధిష్టానం?
X

తెలంగాణలో అధికారంలోకి రావడం మాట అటుంచితే.. రాష్ట్రంలో బీజేపీని కాపాడుకోవడం అధిష్టానానికి కష్టంగా మారింది. రాష్ట్ర బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం.. ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రూపులు కట్టి, మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేస్తుండటం బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు మార్లు బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర నాయకులకు పిలిపించుకొని ఐక్యంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశాల్లో కూడా నాయకుల మధ్య విభేదాలపై చర్చ జరిగింది. గ్రూపు తగాదాలు వీడి.. ఎన్నికలపై దృష్టి పెట్టాలని అధిష్టానం సమాచారం పంపినా.. పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పు రాలేదు.

రాష్ట్ర బీజేపీలో ఉన్న అనైక్యత, విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. క్రమశిక్షణ, ఐక్యత కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ కమిటీకి జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ నాయకత్వం వహించనున్నారు. రాష్ట్ర బీజేపీలో పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి.. ఎన్నికల కోసం సమాయాత్తం చేసేందుకు సునిల్ బన్సల్ కృషి చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మీడియా ముందు, చిట్ చాట్ పేరుతో అనవసరమైన స్వేచ్ఛ తీసుకుంటున్న నాయకులను కట్టడి చేయడానికే సునిల్ బన్సల్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తున్నది.

బీజేపీ తెలంగాణ ఇంచార్జిగా ప్రస్తుతం తరుణ్ చుగ్ వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనను కేవలం పొలిటికల్ ఎఫైర్స్‌కు మాత్రమే పరిమితం చేసి.. పార్టీ ఐక్యత, క్రమశిక్షణ బాధ్యతలు సునిల్ బన్సల్‌కు అప్పగించినట్లు సమాచారం. త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలను త్వరగా పరిష్కరించేందుకు సునిల్ బన్సల్ ప్రయత్నిస్తారని తెలుస్తున్నది.

చేవెళ్లలో బహిరంగ సభ జరిగిన సమయంలో అమిత్ షా ఎదుటే పాత, కొత్త నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కావొద్దనే కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీలో ఉన్న విభేదాలు, ఇతర నాయకులను పార్టీలో చేర్పిండంలో విఫలం అవడం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలహీనంగా ఉన్న అంశాలను ఇటీవల కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్టీ హైకమాండ్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఆ తర్వాతే సునిల్ బన్సల్ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

First Published:  8 Jun 2023 9:26 AM IST
Next Story