మళ్లీ తెరపైకి షర్మిల.. ఈసారి ఏం చేశారంటే..?
వైఎస్సార్టీపీ కండువాలతో ఉన్న కాంగ్రెస్ నేతల ఫొటోలు చూపిస్తూ షర్మిల హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పోటీ చేసే అభ్యర్థుల మెడలో తన పార్టీ కండువాలు చూసుకుని మురిసిపోతున్నారు షర్మిల.
ఎన్నికల్లో అస్త్ర సన్యాసం తర్వాత వైఎస్ షర్మిల దాదాపుగా తెరమరుగైపోయారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి, ఒకటికి రెండు సీట్లు తన కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి, తన భర్త, తన తల్లి కూడా బరిలో ఉంటారని ఎన్నెన్నో చెప్పి చివరకు కాంగ్రెస్ కి సైలెంట్ గా మద్దతిచ్చి పోరు నుంచి తప్పుకున్న షర్మిల.. ప్రజలకు సమాధానం చెప్పలేక చాన్నాళ్లుగా మొహం చాటేశారు. సోషల్ మీడియాకి కూడా ఆమె దూరమయ్యారు. అయితే మళ్లీ ఇప్పుడు ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు షర్మిల. వైఎస్సార్టీపీ కండువాలు కప్పుకున్న కాంగ్రెస్ లీడర్ల ఫొటోలు పోస్ట్ చేసి సంబరపడ్డారు.
కేసీఆర్ ఖేల్ ఖతం, భారాసా దుకాన్ బంద్!
— YS Sharmila (@realyssharmila) November 21, 2023
మరో మూడు వారాల్లో ఈ నియంత పాలన అంతం అని చెప్పే అపురూప దృశ్యాలు ఆవిష్కృతమయ్యే క్షణాలు దగ్గరలోనే.
అవినీతి, అక్రమాలు, అహంకారపు పీడ, వీటన్నిటిలో మగ్గి, నలిగి, కృశించి, కృంగిపోతున్న తెలంగాణకు, నాలుగు కోట్ల ప్రజలకు, త్వరలో స్వేచ్ఛ లభిస్తోందని… pic.twitter.com/zZ2Y6MdSIn
బీఆర్ఎస్ దుకాణం బంద్ అంటూ ట్వీట్ చేశారు షర్మిల. మరో మూడు వారాల్లో బీఆర్ఎస్ పాలన అంతం అవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణకు, నాలుగు కోట్ల ప్రజలకు, త్వరలో స్వేచ్ఛ లభిస్తుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మరొకసారి ఆజాదీ అందివచ్చే రోజులు లెక్కపెట్టుకుందామన్నారు. కౌంట్ డౌన్ షురూ.. అంటూ ట్వీట్ చేశారు షర్మిల.
వైఎస్సార్టీపీ జెండా, అజెండా అన్నీ మాయమైపోయిన సందర్భంలో.. అక్కడక్కడా కొందరు నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల వద్దకు వెళ్లి వారి మెడలో వైఎస్సార్టీపీ కండువాలు కప్పుతున్నారు. అలా కండువాలు కప్పి వారికే తమ మద్దతు అని చెబుతున్నారు. పనిలో పనిగా షర్మిలకు కూడా జై కొడుతున్నారు. ఇలా వైఎస్సార్టీపీ కండువాలతో ఉన్న కాంగ్రెస్ నేతల ఫొటోలు చూపిస్తూ షర్మిల హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పోటీ చేసే అభ్యర్థుల మెడలో తన పార్టీ కండువాలు చూసుకుని మురిసిపోతున్నారు షర్మిల.
♦