వైఎస్ఆర్ ఆత్మ సంతోషించే సందర్భం ఇది -షర్మిల
రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు షర్మిల. తనపై ఉంచిన బాధ్యతను పూర్తి విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేరుస్తానన్నారు షర్మిల.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు రాజన్న బిడ్డగా తాను సంతోషిస్తున్నానని చెప్పారు వైఎస్ షర్మిల. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారామె. రాజశేఖర్ రెడ్డి ఆత్మ సంతోషపడే సందర్భం ఇదని అన్నారు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. దేశానికి పునాది వేసిందే కాంగ్రెస్ అని, ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోవడం, ప్రతి వర్గానికీ నమ్మకం కలిగించడం ద్వారా కాంగ్రెస్, భారత్ ని ఏకం చేసిందన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి వైఎస్సార్టీపీ చేసిన కృషిని, తాను చేసిన త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ లోకి తమను ఆహ్వానించారన్నారు. వారి ఆహ్వానం మన్నించి విలీనం అయ్యామని, తనపై ఉంచిన బాధ్యతను పూర్తి విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేరుస్తానన్నారు షర్మిల.
#WATCH | YSRTP chief & Andhra Pradesh CM's sister YS Sharmila joins Congress, in the presence of party president Mallikarjun Kharge and Rahul Gandhi, in Delhi pic.twitter.com/SrAr4TIZTC
— ANI (@ANI) January 4, 2024
ఢిల్లీలో చేరిక..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం తాడేపల్లిలో తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు సీఎం జగన్ కి అందించిన అనంతరం.. సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు షర్మిల. ఈరోజు ఉదయం భర్త అనిల్ తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్టు ప్రకటించారు.
#WATCH | YS Sharmila merges YSR Telangana Party with Congress
— ANI (@ANI) January 4, 2024
"Congress party is still the largest secular party of our country and it has always upheld the true culture of India and built foundations of our nation..." pic.twitter.com/lk6hlGdZBq
షర్మిల కు ఏపీ బాధ్యతలు..
కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆమె చేరడం ఆలస్యం.. ఆమె వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మరింతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు కానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ఖాయమని తేలిపోయింది.