Telugu Global
Telangana

షర్మిలలో అయోమయం పెరిగిపోతోందా?

పాలేరులో తుమ్మల పోటీ ఖాయమైతే మరి షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తారు? సికింద్రాబాద్ ఎంపీగానా లేకపోతే కర్నాటక కోటాలో రాజ్యసభ ఎంపీ అవుతారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

షర్మిలలో అయోమయం పెరిగిపోతోందా?
X

తెలంగాణలో రాజకీయాలు చాలా స్పీడుగా మారిపోతున్నాయి. ఈ రోజు తెర మీద ప్రముఖంగా ఉన్నవాళ్ళు మరుసటి రోజుకు వెనక్కు వెళ్ళిపోతున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయాలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీ చేయటానికి తుమ్మలకు కేసీఆర్‌ టికెట్ ఇవ్వలేదు. దాంతో ముందు అలిగి తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన తుమ్మల కాంగ్రెస్ చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మద్దతుదారులు ఎప్పటినుండో మాజీ మంత్రిని కాంగ్రెస్‌లో చేరాలని చేస్తున్న ఒత్తిళ్లు తొందరలో సక్సెస్ అవబోతోంది.

తుమ్మల సంగతి ఓకేనే మరి వైఎస్ షర్మిల మాటేమిటి? అనే చర్చ మొదలైంది. తుమ్మలకు షర్మిలకు లింకు ఏమిటంటే నియోజకవర్గం. పాలేరులో ఎప్పటి నుంచో తుమ్మల పోటీ చేస్తున్నారు. రెండేళ్ళ క్రితం తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ మధ్య వరకు షర్మిల గురించి వార్తలు బాగా ప్రచారంలో ఉండేవి. అలాంటిది ఎందుకనో షర్మిల ఇపుడు వార్తల్లో కనబడటంలేదు.

ఎందుకంటే కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన తర్వాత షర్మిల కూడా పాలేరు నుండే అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు బాగా ప్రచారం జరిగింది. మరి విలీనం ఏమైందో, పాలేరులో పోటీ ఏమైందో తెలీదు. సడెన్‌గా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరిక, పాలేరులో పోటీ తెరపైకి వచ్చేసింది. ఇపుడు తుమ్మల వ్యవహారం ఖమ్మం జిల్లాలో, కాంగ్రెస్‌లో చాలా జోరుగా నడుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల కాంగ్రెస్‌లో చేరబోతున్నారట. అంటే పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఖాయమైతేనే ఆయన పార్టీలో చేరటానికి అంగీకరించుంటారు.

అందుబాటులోని సమాచారం ప్రకారం పాలేరులో పోటీకే తుమ్మల పట్టుబడితే అందుకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా స్పందించిందట. కాబట్టే షర్మిల వ్యవహారం ఏమైందనే అయోమయం పెరిగిపోతోంది. పాలేరులో తుమ్మల పోటీ ఖాయమైతే మరి షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తారు? సికింద్రాబాద్ ఎంపీగానా లేకపోతే కర్నాటక కోటాలో రాజ్యసభ ఎంపీ అవుతారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరో ఆరు రోజులు ఆగితే పాలేరుపై క్లారిటి వచ్చేస్తుంది.


First Published:  31 Aug 2023 11:02 AM IST
Next Story