Telugu Global
Telangana

కలిసి పనిచేద్దామంటూ షర్మిల ఫోన్, సై అన్న సంజయ్, తర్వాత చెప్తానన్న రేవంత్

షర్మిల ఫోన్లకు ఇద్దరు ప్రతిపక్ష నాయకులు చెరో రకంగా స్పందించారు. షర్మిల ఆఫర్ కు వెంటనే ఓకే చెప్పిన బండి సంజయ్ త్వరలోనే సమావేశం అవుదామని ప్రతిపాదించారు. షర్మిలకు తన పూర్తి మద్దతు ఉంటుందని బండి హామీ ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఆచితూచి స్పందించారు.

కలిసి పనిచేద్దామంటూ షర్మిల ఫోన్, సై అన్న సంజయ్, తర్వాత చెప్తానన్న రేవంత్
X

తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాదయాత్రలు, ధర్నాలు, నిరుద్యోగ దీక్షలు...ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బీఆరెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. నాయకులపై వ్యక్తిగత దాడులు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకర్షిద్దామనే ప్రయత్నం చేసినా అది బెడిసి కొట్టింది.

ఇప్పుడిక తను బలపడాలంటే మిగతా ప్రతిపక్షాలను కూడా కూడగట్టాలని భావించిన షర్మిల హఠాత్తుగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల‌కు ఫోన్లు చేశారు. అందరం కలిసి కేసీఆర్ పై పోరాడుదామని ఆఫర్ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం అందరం కలిసి ఛలో ప్రగతి భవన్ కార్యక్రమం చేపడదామని సూచించారు. బీఆరెస్ ను ఓడించి ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలంటే అందరం ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.

షర్మిల ఫోన్లకు ఇద్దరు ప్రతిపక్ష నాయకులు చెరో రకంగా స్పందించారు. షర్మిల ఆఫర్ కు వెంటనే ఓకే చెప్పిన బండి సంజయ్ త్వరలోనే సమావేశం అవుదామని ప్రతిపాదించారు. షర్మిలకు తన పూర్తి మద్దతు ఉంటుందని బండి హామీ ఇచ్చారు.

ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఆచితూచి స్పందించారు. షర్మిల ప్రపోజల్ బాగానే ఉందని అయితే ఈ విషయంపై తాను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేనని, పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తానని తెలిపారు.

బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపీలను ఒకే వేదిక మీదికి షర్మిల తీసుకరాగలరా ? మరో వైపు బీఆరెస్ తో పొత్తు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీతో చేతులు కలుపుతుందా ? రాష్ట్రంలో ఎంతో కొంత ఓట్ల శాతం ఉన్న కాంగ్రెస్, బీజేపీలు, అసలు ఓట్ల శాతం ఎంతుందో కూడా తెలియని షర్మిల నాయకత్వంలో ఏకమవుతాయా ? ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

First Published:  1 April 2023 2:31 PM IST
Next Story