శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
శంషాబాద్‌లోని విమానాశ్రయంలో బాంబు పెట్టామని, రాత్రి 7 గంటలకు అది పేలుతుందని సోమవారం ఉదయం 11.50 గంటలకు ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్‌కి మెయిల్ పంపించాడు.
బాంబు బెదిరింపులతో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విమానాశ్రయం మొత్తం తనిఖీలు చేయించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. విమానాశ్రయంలో దిగిన విమానాల లగేజీని, ప్రయాణికులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శంషాబాద్‌లోని విమానాశ్రయంలో బాంబు పెట్టామని, రాత్రి 7 గంటలకు అది పేలుతుందని సోమవారం ఉదయం 11.50 గంటలకు ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్‌కి మెయిల్ పంపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టిన సిబ్బంది చివరికి ఎలాంటి బాంబూ లేదని నిర్ధారించుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఐడీతో విమానాశ్రయ అధికారులకు ఇంకో మెయిల్ వచ్చింది. తప్పు జరిగిందని, తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్ సందేశాలు పెట్టాడని అజ్ఞాత వ్యక్తి అందులో పేర్కొన్నాడు. తనను క్షమించాలని ఈ సందర్భంగా ఆ మెయిల్‌లో కోరాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్థానిక పోలీసులకు విమానాశ్రయ అధికారులు ఫిర్యాదు చేశారు. మెయిల్ ఆధారంగా సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
*