ఎల్లుండి స్కూళ్ల బంద్ కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో నిరసన
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని.. దీనిని నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ కు పిలుపునిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యశాఖను పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖను చూస్తున్నారని, అయినా శాఖ నిర్వహణలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని అన్నారు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని ప్రశ్నించారు. ఇంత మంది విద్యార్థులు మరణించినా సీఎం కనీసం సమీక్ష చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నో రూపాల్లో విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, చలనం లేకపోవడంతోనే స్కూళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు.