Telugu Global
Telangana

తెలంగాణ వరి రకాలపై ఇతర రాష్ట్రాల ఆసక్తి.. తక్కువ నీటితో పండటమే కారణం

కొత్త వరి రకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అదే సమయంలో తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయని పీజేటీఎస్ఏయూ మాజీ చాన్సలర్ వి. ప్రవీణ్ రావు అన్నారు.

తెలంగాణ వరి రకాలపై ఇతర రాష్ట్రాల ఆసక్తి.. తక్కువ నీటితో పండటమే కారణం
X

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకొని పోతుందని చెప్పడానికి మరో ఉదాహరణ ఇది. ఇప్పటికే ఫార్మా, ఐటీ రంగాల్లో ఇతర రాష్ట్రాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నీటి పారుదల రంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. ఇవ్వాళ తెలంగాణ ఇండియాకే రైస్ బౌల్‌గా మారిపోయింది. కేవలం పంటలు పండించడమే కాకుండా కొత్త వంగడాలను సృష్టించడంలో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందున్నది.

దేశంలో అత్యధిక వరి రకాలను తయారు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కింది. రాష్ట్రంలో 17 కొత్త వెరైటీలను గత మూడేళ్లలోనే వ్యవసాయ పరిశోధకులు తయారు చేశారు. అతి తక్కువ నీటిని వినియోగించే రకాలుగా సైంటిస్టులు చెబుతున్నారు. దేశంలో ఇలా తక్కువ నీటిని ఉపయోగించే వంగడాలు ఎక్కడా లేవని అంటున్నారు. తెలంగాణ వరి వంగడాలపై ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల రైతులు మన వంగడాలతో పంటలు కూడా పండిస్తున్నారని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) మాజీ డైరెక్టర్, పరిశోదకుడు ఆర్. జగదీశ్వర్ చెప్పారు.

తెలంగాణ వరి రకాలు ఉపయోగించి ఒక లక్ష ఎకరాల్లో పంట సేద్యం చేస్తే.. ఒక సీజన్‌లో దాదాపు ఒక టీఎంసీ (1000 మిలియన్ క్యూబిక్ ఫీట్) నీటిని ఆదా చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తెలంగాణ సోనా, కూనారం 1638, వరంగల్ 962, జగిత్యాల్ 94423, కునారం 118, తెల్ల హంస, ఎంటీయూ 1010 రకాలకు చాలా డిమాండ్ ఉన్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. పీజేటీఎస్ఏయూ ఇప్పటికే అనేక రకాలైన వరి వంగడాలను సృష్టించిందని.. ఒక్కో రకాన్ని సృష్టించి, పరీక్షించడానికి ఆరేళ్ల సమయం పడుతుందని పరిశోధకులు అంటున్నారు.

అగ్రకల్చర్ యూనివర్సిటీ రూపొందించిన ఈ వరి రకాలు ఎకరాకు 500 లీటర్ల నీటిని వాడతాయని అన్నారు. అంతే కాకుండా ఈ వరి పూర్తిగా పండటానికి కేవలం 125 రోజుల సమయం సరిపోతుందని అన్నారు. గతంలో అయితే కనీసం 150 రోజులు పట్టేదని.. ఇప్పుడు ఇరవై ఐదు రోజుల ముందుగానే పంట చేతికి వస్తుందని చెప్పారు. ఇక పాత వరి రకాలతో పంట వేస్తే ఎకరాకు 2,500 నుంచి 3,000 లీటర్ల నీళ్లు అవసరం అయ్యేవి. కానీ ఈ కొత్త రకాలు కేవలం 500 లీటర్ల నీటిని మాత్రమే వాడుకుంటాయని స్పష్టం చేస్తున్నారు. కొత్త వరి రకాలు హెక్టారుకు 2,400 కేజీల నుంచి 2,600 కేజీల వరకు ధాన్యాన్ని ఇస్తాయని అన్నారు.

కొత్త వరి రకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అదే సమయంలో తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయని పీజేటీఎస్ఏయూ మాజీ చాన్సలర్ వి. ప్రవీణ్ రావు అన్నారు. వరి అనేది చాలా ఎక్కువ నీటిని ఉపయోగించుకునే పంట. అందుకే రైతులను ఈ కొత్త రకాలపై ఆకర్షితులను చేయడం ద్వారా నీటి వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో వేస్తున్న వరిలో 70 శాతం ఈ వెరైటీలు ఉన్నాయని ఆయన తెలిపారు.

వరిలో నారు పెంచి, తర్వాత నాట్లు వేసే సాంప్రదాయ పద్దతికి స్వస్తి పలికితే నీటి వాడకం తగ్గుతుంది. కొత్త వరి రకాలను నేరుగా పొలాల్లో చల్లి లేదా వెట్ డైరెక్ట్ సీడింగ్ లేదా డ్రమ్ సీడింగ్ పద్దతుల్లో పంటను పండించవచ్చు. ఇలా నీటిని భారీగా ఆదా చేయగలుగుతామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ వరి రకాలను ఉపయోగించాలని రైతులకు చెబుతోందని వారు అన్నారు.

First Published:  30 March 2023 8:35 AM IST
Next Story