Telugu Global
Telangana

ఎవరి దారి వారిదే.. టీ.బీజేపీలో వింత పరిస్థితి!

ఇటీవల తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ శర్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రెండో వరుసలో కూర్చున్నారు.

ఎవరి దారి వారిదే.. టీ.బీజేపీలో వింత పరిస్థితి!
X

తెలంగాణ బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మంగళవారం పార్టీ చీఫ్‌ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలకమైన పదాధికారుల సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్సీ AVN రెడ్డి సైతం హాజరుకాలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక్కరే హాజరుకాగా.. పాయల్ శంకర్, వెంకటరమణా రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పవార్, పైడి రాకేష్ రెడ్డి, రాజాసింగ్‌ దూరంగా ఉన్నారు.

కిషన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ శర్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రెండో వరుసలో కూర్చున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం మొదటి వరుసలో కూర్చున్న వారితో మాట్లాడిన గవర్నర్.. రెండో వరుసలో కూర్చున్న బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లలేదు. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి తమను గవర్నర్‌కు పరిచయం చేస్తారని ఎమ్మెల్యేలు భావించారు. కానీ, అది జరగకపోవడంతో ఎమ్మెల్యేలు అవమానంగా ఫీల్ అయ్యారని తెలుస్తోంది.

ఇక పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలు ఐదు గ్రూపులుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్‌ పార్టీ లీడర్లతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేఎల్పీ లీడర్‌ మహేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు ఒక్కరే మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవలి అసెంబ్లీ సమావేశాలకు ముందు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యేలను ఆహ్వానించగా.. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బీజేఎల్పీ పదవుల విషయంలో తమను పరిగణలోకి తీసుకోలేదని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని.. ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

First Published:  7 Aug 2024 11:20 AM IST
Next Story