Telugu Global
Telangana

అసెంబ్లీ ముట్టడికి VRAలు సహా ఏడు సంఘాల యత్నం, పోలీసు లాఠీ చార్జ్... హై టెన్షన్

విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ (VRA)ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. వీఆర్ ఏ లపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడమే కాక పలు చోట్ల వారిని అరెస్టు చేశారు.

అసెంబ్లీ ముట్టడికి VRAలు సహా ఏడు సంఘాల యత్నం, పోలీసు లాఠీ చార్జ్... హై టెన్షన్
X

తమ సమస్యల పరిష్కారం కోసం తమ తమ గ్రామాల్లో 50 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ (VRA) ఈ రోజు ఛ‌లో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఇందిరా పార్క్ నుండి అసెంబ్లీ వైపు వెళ్ళడానికి వందలాది మంది వీఆర్ ఏ లు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర 200 మంది వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వీఆర్ ఏ లు అనేక ప్రాంతాల నుంచి అసెంబ్లీ వైపు చొచ్చుక వెళ్ళడానికి ప్రయత్నించారు. నాంపల్లి, బషీర్ బాగ్, లకిడీకా పూల్ వైపు నుండి కూడా వీఆర్ ఏలు పెద్ద ఎత్తున వస్తూండటంతో పోలీసులు అసెంబ్లీ చుట్టూ ఉన్న రోడ్లన్నింటినీ బ్లాక్ చేశారు. ఎక్కడికక్కడ వీఆర్ ఏలను అరెస్టు చేశారు.

మరో వైపు, మత్సకారులు, సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ తమ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వీరే కాక మొత్తం ఏడు సంఘాలు ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినట్టు సమాచారం. వీఆర్ ఏ లకు వీళ్ళు కూడా తోడవడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. పలు చోట్ల పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.


మరో వైపు వీఆర్ ఏ లతో చర్చలు జరిపేందుకు సిద్దమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలే ఏకైక మార్గమని చెప్పిన ఆయన వీఆర్ ఏ ల ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతామని చెప్పారు.



First Published:  13 Sept 2022 8:12 AM GMT
Next Story