గాంధీ భవన్‌లో దిగ్విజయ్ ముందే గల్లాలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు..
ఉస్మానియా యూనివర్శిటీ నుంచి గాంధీ భవన్ కు వచ్చిన కొందరు ఎన్ ఎస్ యూ ఐ నేతలు పిసిసి ప్రధానకార్యదర్శి అనిల్ కుమార్ తో వాగ్వాదానికి దిగారు. ఉత్తమ్ కుమార్ వంటి సీనియర్ నేతలను ఎలా తిడతావంటూ ప్రశ్నించారు. ఇరువురి మధ్యా మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఉద్రేకాలకుపోయి కాలర్లు పట్టుకునే వరకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పార్టీ ప్రతినిధిగా వచ్చిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎదుటనే కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగి గల్లాలు పట్టుకోవడంతో గురువారంనాడు గాంధీ భవన్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర కాంగ్రెస్ లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు అధిష్టానం పార్టీ సినియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పంపించింది. ఆయన గురువారంనాడు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఒక్కొక్క నేతతో విడివిడిగా సమావేశం అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్శిటీ నుంచి కొందరు విద్యార్ధి నేతలు కూడా గాంధీ భవన్ కు వచ్చి తమ అభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ కు చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో పిసిసి ప్రధానకార్యదర్శి అనిల్ కుమార్ అక్కడ ఉండడంతో విద్యార్ధి సంఘం నేతలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఉత్తమ్ కుమార్ వంటి సీనియర్ నేతలను ఎలా తిడతావంటూ ప్రశ్నించారు. సీనియర్లను దూషించినందుకు అనిల్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
దీంతో ఇరువురి మధ్యా మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఉద్రేకాలకుపోయి కాలర్లు పట్టుకునే వరకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్ అంటూ ఓయూ విద్యార్ధి నేతలు నినాదాలతో గాంధీ భవన్ ను హోరెత్తించారు. స్వార్ధనాయకులను పార్టీ దూరంగా పెట్టాలని, పార్టీ కోసం నిజాయితీగా కష్టపడేవారికి పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. . .తమకు పదవులు రాలేదని ఓయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలోనే సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి అక్కడికి చేరకుని వారిని సముదాయించడంతో పరిస్థితి చల్లబడింది. అనంతరం రవి మాట్లాడుతూ ఇలా కొట్టుకోవడం, తిట్టుకోవడం వల్లనే పార్టీ పలచనై పోతోందన్నారు. పార్టీ కోసం అంతా సమన్వయంతో కలిసిమెలిసి పని చేయాలని కోరుతున్నానని అన్నారు. వచ్చే ఎన్నికలలో బిఆరెస్, బిజెపిలపై పోరాటానికి సమష్టిగా కృషి చేయాలని ఆయన చెప్పారు.