అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం
అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరీంగంజ్ పేరును శ్రీ భూమిగా మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అస్సాం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఓ జిల్లా పేరును మార్చింది. కరీంగంజ్ పేరును శ్రీ భూమిగా మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా తెలిపారు.‘‘విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంద ఏళ్ల క్రితం కరీంగంజ్ గడ్డను మా లక్ష్మీగా అభివర్ణించారు. ఆయన గౌరవార్థం నేడు ఈ ప్రాంతానికి శ్రీ భూమిగా పేరు మారుస్తున్నాం. ఇక నుంచి ఈ పేరు అధికారికంగా వాడుకలో ఉంటుంది.
బీజేపీ ఆధ్వర్యంలో అస్సాం ప్రభుత్వం ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. వారి ఆకాంక్షలు ప్రభుత్వ నిర్ణయంలో ప్రతిబింబిస్తున్నాయి’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అస్సాం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల జాబితాను డిసెంబర్‌లోగా ప్రచురించాలని కూడా అసోం మంత్రివర్గం మంగళవారంనాడు నిర్ణయించింది. 2025 ఫిబ్రవరి 10లోగా ఎన్నికలను పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. 2025 ఫిబ్రవరి 24న గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే మరో కీలక నిర్ణయాన్ని కూడా మంత్రి వర్గం తీసుకుంది