బీజేపీలో గ్రూప్‌వార్.. సీనియర్లు వర్సెస్ జూనియర్లు
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. క్యాండిడేట్లను స్క్రీనింగ్ చేసే ప్రక్రియలో భాగంగా అభ్యర్థి సీనియర్ లీడరా.. కొత్తగా పార్టీలో చేరారా అన్న విషయాన్ని కచ్చితంగా మెన్షన్ చేయాలని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ ఫస్ట్‌వీక్‌లో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయాలని భావిస్తున్న తెలంగాణ బీజేపీకి పార్టీలో గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారాయి. పార్టీలో పాత కాపులు వర్సెస్ కొత్తగా చేరిన వారు అన్నట్లుగా సీన్ మారింది. ఈ సారి స్క్రీనింగ్ కమిటీ, ఎలక్షన్ కమిటీ ఎంపిక విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం 15 మంది సభ్యులతో స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షత వహించాలని ఈటల రాజేందర్ భావిస్తుండగా.. ఈ నిర్ణయంతో పార్టీ సీనియర్లు విబేధించినట్లు సమాచారం. వారంతా స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఇంద్రసేనా రెడ్డి పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇక ఎలక్షన్ కమిటీలో 21 మంది పేర్లు ఉండనున్నాయి. రెండు కమిటీల్లో సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత తుది జాబితాలు ప్రకటించనున్నారు. అయితే కమిటీలలో కీలక బాధ్యతలు ఎవరికీ అప్పగించాలనే దానిపై తర్జనభర్జన నడుస్తోంది. సీనియర్లు, కొత్తవారిని ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై ఆలోచనలు జరుగుతున్నాయి. ఏ రకంగా చూసుకున్నా.. పార్టీలో పాత కాపులదే పైచేయి అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. క్యాండిడేట్లను స్క్రీనింగ్ చేసే ప్రక్రియలో భాగంగా అభ్యర్థి సీనియర్ లీడరా.. కొత్తగా పార్టీలో చేరారా అన్న విషయాన్ని కచ్చితంగా మెన్షన్ చేయాలని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల కమిటీలో స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికల కమిటీకి రాష్ట్ర పార్టీ చీఫ్ నేతృత్వం వహిస్తారు. అయినప్పటికీ కొంతమంది కొత్తగా పార్టీలో చేరిన నేతలు ఈ కమిటీకి నాయకత్వం వహించాలన్న ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎలక్షన్ ఇన్‌ఛార్జి ప్రకాష్ జవడేకర్ అభ్యర్థుల ఎంపిక అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.