మునుగోడు బరిలోకి సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ గౌడ్..?
సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన పల్లె రవికుమార్ గౌడ్ స్థానికుడు కావడంతో మునుగోడులో మంచి పరిచయాలు ఉన్నాయి.
మునుగోడు ఉపఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు సరైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉంటారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. కాగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఒక పేరు తెరపైకి వచ్చింది. జర్నలిస్టు సర్కిల్స్‌లోనే కాకుండా మునుగోడు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఆయనే సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ గౌడ్.
సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన పల్లె రవికుమార్ గౌడ్ స్థానికుడు కావడంతో మునుగోడులో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, సోదరుడు వామపక్ష ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటులో పల్లె రవికుమార్ ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ తరపున టికెట్ వస్తుందని ఆశించి.. భంగపడ్డారు. మధ్యలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని అనుకున్నా.. ఆ ఆశ కూడా నెరవేరలేదు.
ఈ క్రమంలో పల్లె రవికుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన భార్య పల్లె కల్యాణి చండూరు మండల అధ్యక్షురాలిగా కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. ఆయన బంధువులు కూడా పలు గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలుగా ఉన్నారు. దీంతో ఈ సారి కాంగ్రెస్ తరపున పల్లె రవికుమార్‌కు టికెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవాలంటే బలమైన నేపథ్యం ఉన్న నాయకుడు అవసరం అని రేవంత్ అనుకుంటున్నారు. పల్లె రవికుమార్ మునుగోడు అభ్యర్థిత్వానికి సరైన ఛాయిస్ అని కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నాయకులు కూడా భావిస్తున్నారు.
గౌడ సామాజిక వర్గానికి చెందిన పల్లె రవికుమార్‌కు బీసీల్లో మంచి పట్టుంది. మునుగోడులో గౌడ్లతో పాటు ముదిరాజ్, యాదవ్, ఎస్సీల ఓట్లు కీలకం కానున్నాయి. సంప్రదాయంగా వస్తున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు.. పల్లె రవి సామాజిక వర్గం, స్థానికంగా ఉన్న పలుకుబడి కారణంగా ఆయన గెలుస్తాడనే అంచనాకు వచ్చారు. పల్లె రవి బరిలో ఉంటే వామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు. మరోవైపు పాల్వాయి స్రవంతి నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. అయితే ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడిన ఫోన్ రికార్డ్ కాంగ్రెస్ వర్గాల్లో హల్ చల్ చేసింది. అంతే కాకుండా.. పల్లె రవితో పోలిస్తే స్రవంతి బలమైన క్యాండిడేట్ కాదనే వాదన కూడా ఉంది. అందుకే రవినే కాంగ్రెస్ తరపున నిలబెడతారని.. వారం రోజుల్లో ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.