జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ రోనాల్డ్ రోస్
రోనాల్డ్ రోస్ గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఖైరతాబాద్ జోన్‌తో పాటు హెల్త్ అండ్ శానిటేషన్ కమిషనర్‌గా వ్యవహరించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్ రోస్.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతున్న లోకేశ్ కుమార్‌ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎలక్షన్ కమిషన్ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోకేశ్ కుమార్‌ను ఇప్పటికే బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రోనాల్డ్ రోస్‌కు అప్పగించింది.
రోనాల్డ్ రోస్ గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఖైరతాబాద్ జోన్‌తో పాటు హెల్త్ అండ్ శానిటేషన్ కమిషనర్‌గా వ్యవహరించారు. అంతకు ముందు మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. ఉమ్మడి ఏపీలో సెర్ప్ అడిషనల్ సీఈవోగా, డ్వాక్రా డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉన్నది. రంపచోడవరం ఐటీడీఏ పీవోగా, నర్సాపురం సబ్ కలెక్టర్‌గా పని చేశారు.
రాష్ట్రంలోని పలువురి అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్నసర్ఫరాజ్ అహ్మద్‌ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమిచింది. సర్ఫరాజ్‌ను ప్రభుత్వం ఈసీకి బదిలీ చేసి.. వెయిటింగ్‌లో ఉన్న ముషారఫ్ అలీ ఫారుఖీని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని పలువురు జోనల్ కమిషనర్లను సోమవారమే బదిలీ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ జే.శంకరయ్యను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ అదనపు కమిషన్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ ఇంచార్జి ఎస్. పంకజను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా పరిమితం చేశారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న రవి కిరణ్‌ను సికింద్రాబాద్ జోన్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ.. అదనంగా ఖైరతాబాద్ బాధ్యతలు కూడా అప్పగించారు. టి. వెంకన్నను చార్మినార్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న అశోక్ సామ్రాట్‌ను సీడీఎంఏ జేడీగా నియమించారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్న వి. మమతను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి.. కేవలం కూకట్‌పల్లి జోన్‌కు పరిమితం చేశారు. శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్‌గా ఆర్. ఉపేందర్ రెడ్డిని నియమించారు. శేరిలింగంపల్లి జోన్ బాధ్యతలను ఎన్.సుధాంశ్‌కు అప్పగించారు.