Telugu Global
Telangana

మైనంపల్లికి రెండు టిక్కెట్లా.. మాకూ ఇవ్వండి!

కాంగ్రెస్‌లో కేవలం ఉత్తమ్‌ దంపతులే కాకుండా పలువురు సీనియర్లు రెండు టికెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన కూతురు త్రిషకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

మైనంపల్లికి రెండు టిక్కెట్లా.. మాకూ ఇవ్వండి!
X

కాంగ్రెస్‌లో మైనంపల్లి హన్మంత రావు చేరిక కొత్త వివాదానికి దారి తీసింది. శుక్రవారం రాహుల్‌ గాంధీని కలిసిన మైనంపల్లి మూడు టికెట్లు డిమాండ్ చేశారు. అయితే ఆయనకు రెండు టికెట్లు ఇస్తామని హామీ లభించినట్లు తెలుస్తోంది. మైనంపల్లిని స్వయంగా ఢిల్లీకి తీసికెళ్లి పార్టీలో చేర్పించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొత్తగా చేరిన వాళ్లకు రెండు టికెట్లు ఇచ్చే అవకాశం లేకున్నా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మైనంపల్లికి రెండు టికెట్లు ఇస్తున్నట్లు చెప్తున్నారు.

మైనంపల్లికి రెండు టికెట్ల అంశాన్ని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారట. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమివ్వడాన్ని తప్పుపడుతున్నారు సీనియర్లు. గతంలో ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపైనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమావేశంలో ఉత్తమ్‌ మధ్యలోనే వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది.

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి దరఖాస్తు చేసుకోగా.. ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి అర్జీ పెట్టుకున్నారు. 2018లో కోదాడ నుంచి పోటీ చేసిన పద్మావతి ఆ ఎన్నికల్లో 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక కోదాడ, హుజుర్‌ నగర్‌ స్థానాల్లో పోటీ కోసం కాంగ్రెస్‌ నుంచి జార్జిరెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి సైతం పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్‌లో కేవలం ఉత్తమ్‌ దంపతులే కాకుండా పలువురు సీనియర్లు రెండు టికెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన కూతురు త్రిషకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క తన కుమారుడు సూర్యంకు ఎస్టీ రిజర్వ్‌డ్‌ పినపాక స్థానం ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ సైతం తన కొడుక్కి మహబూబబాద్‌ అసెంబ్లీ స్థానం ఇవ్వాలని కోరుతున్నారు. తాను మహబూబబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు వరంగల్ ఈస్ట్, పరకాల స్థానాలు కోరుతున్నారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ తన కూతురికి టికెట్ ఇవ్వకపోవడంతో కొండా సురేఖ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఇక మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌ రెడ్డి, ఆయన సోదరి విజయా రెడ్డి జూబ్లిహిల్స్, ఖైరతాబాద్ స్థానాలు అడుగుతున్నారు. ఇక మాజీ మంత్రి జానారెడ్డి ఇద్దరు కుమారులు నాగార్జున సాగర్, మిర్యాల‌గూడ స్థానాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ సైతం టికెట్ రేసులో ఉన్నారు.

First Published:  30 Sept 2023 10:43 AM IST
Next Story