బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి
మహేశ్వర్ రెడ్డికి తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ లు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరుతారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మహేశ్వర్ రెడ్డి తన రాజీనామా లేఖను ఖర్గే కు పంపారు. ఆయన ఇవ్వాళ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్ళారు.
వీరు ముగ్గురు కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకులు తరుణ్ చుగ్ ఇంటికి వెళ్ళారు. బీజేపీలో చేరనున్న మహేశ్వర్‌రెడ్డిని తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ లు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరుతారు. ఈరోజు రాత్రిలోగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా మహేశ్వర్ రెడ్డి కలుస్తారని తెలుస్తోంది.
కాగా, మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ నాయకత్వానికి ముందుగానే సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మహేశ్వర్ రెడ్డికి నిన్ననే షోకాజ్ నోటీసు జారీ చేశారు. బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తూ టీపీసీసీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మహేశ్వర్‌రెడ్డిపై ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. షోకాజ్ నోటీసుకు గంటలోగా వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.