Telugu Global
Telangana

మునుగోడులో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ హుషారైంది

మొదటి నుంచి నిజమైన కాంగ్రెస్‌ వారికి అన్యాయం జరుగుతోందని తాను చెబుతూనే ఉన్నానని.. ఆ సమయంలో తనను కూడా తిట్టారన్నారు. ఇప్పటికైనా సీనియర్లను పీసీసీ కలుపుకునిపోవాలన్నారు.

మునుగోడులో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ హుషారైంది
X

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయంలో నిర్ణయం మార్చుకునేలా లేరని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌. ఒరిజినల్ కాంగ్రెస్‌ నేతలకు అన్ని చోట్ల అన్యాయమే జరుగుతోందన్నారు. తనకు కూడా కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిందని.. అయినా పార్టీలోనే ఉంటూ పోరాటం చేస్తున్నానని వీహెచ్ చెప్పారు. బీజేపీలోకి వెళ్లిపోయేందుకు రాజగోపాల్‌ డిసైడ్ అయ్యారని.. లాభం ఉన్న చోటకు వెళ్తే తప్పులేదన్నారు.

రాజగోపాల్‌ను తాను అడిగానని.. ఆయన మాటల బట్టి కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్‌లో అవమానాలు జరిగాయని తనతో చెప్పారన్నారు. మొదటి నుంచి నిజమైన కాంగ్రెస్‌ వారికి అన్యాయం జరుగుతోందని తాను చెబుతూనే ఉన్నానని.. ఆ సమయంలో తనను కూడా తిట్టారన్నారు. ఇప్పటికైనా సీనియర్లను పీసీసీ కలుపుకునిపోవాలన్నారు.

కాంగ్రెస్‌ చచ్చిపోయిందని కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అన్నారని.. వేరే పార్టీలోకి వెళ్తే వెళ్లవచ్చు గానీ కాంగ్రెస్‌ చచ్చిపోయిందని మాట్లాడాల్సిన అవసరం ఏముందని వీహెచ్ ప్రశ్నించారు. భారతదేశం ఉన్నంత కాలం కాంగ్రెస్ ఉంటుందన్నారు. రాజగోపాల్‌ రెడ్డి వెళ్తే మునుగోడు ఉప ఎన్నికలకు సిద్ధమా అన్న దానిపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. ఎవరికి టికెట్ ఇస్తారో, ఎలా ఎన్నికలకు వెళ్తారో నాయకులే చెప్పాలన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఇప్పటికే చాలా హూషారుగా ఉందని.. అక్కడ ఏ పని అడిగితే ఆ పని చేసేస్తున్నారని వీహెచ్ చెప్పారు. కాంగ్రెస్ చేసిన తప్పుల కారణంగానే గత ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని.. ఇప్పటికైనా సీనియర్లందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని వీహెచ్ సలహా ఇచ్చారు.

వెళ్తే పార్టీకి నష్టమే- మహేశ్వర్‌ రెడ్డి

రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వీడి వెళ్తే కాంగ్రెస్‌కు నష్టమేనని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి అభిప్రాయడ్డారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలను కొనుగోలు చేయడం ద్వారా పార్టీని బలహీనపరిచేందుకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పనిచేస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోతే వచ్చే ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ భయపడదన్నారు.

First Published:  29 July 2022 8:16 AM IST
Next Story