Telugu Global
Telangana

రావాలయ్యా రావాలి.. స్టార్ క్యాంపెయినర్ రావాలి..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచార బరిలో దూకాలని పిలుపునిచ్చారు సీనియర్ నేత వి.హనుమంతరావు. స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ ఆయన ఇలా వెనకాడటం మంచిది కాదని చెప్పారు.

రావాలయ్యా రావాలి.. స్టార్ క్యాంపెయినర్ రావాలి..
X

"నేను అలిగా, అందుకే ప్రచారానికి రావట్లేదు, అంతే కాని నా తమ్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇబ్బంది పడి కాదు." అంటూ ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అది కూడా కోవర్ట్ రెడ్డి అంటూ కేటీఆర్ నుంచి పంచ్ పడిన తర్వాతే వెంకట్ రెడ్డి బయటకొచ్చారు. ఇదే వెంకట్ రెడ్డి గతంలో తనకు స్టార్ క్యాంపెయినర్ పదవి ఇవ్వలేదని అలిగారు. తీరా ఆ పదవి ఇచ్చి ప్రచార రంగంలో దూకవయ్యా అంటే.. పార్టీలో జరిగిన అవమానాలతో మనస్థాపం చెందానంటూ మరో కథ వినిపిస్తున్నారు. ఈ కథలన్నీ పక్కనపెట్టాలని, ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచార బరిలో దూకాలని పిలుపునిచ్చారు సీనియర్ నేత వి.హనుమంతరావు. స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ ఆయన ఇలా వెనకాడటం మంచిది కాదని చెప్పారు.

నాకు జరిగిన అవమానాలతో పోల్చుకుంటే..?

తనకు జరిగిన అవమానాలతో పోల్చుకుంటే కోమటిరెడ్డికి జరిగినవి ఓ లెక్కా అన్నట్టు మాట్లాడారు వీహెచ్. తాను కూడా సర్దుకుపోయి పార్టీ కోసం పనిచేస్తున్నానని, ఏనాడూ పార్జీ జెండాను పక్కనపెట్టలేదని గుర్తు చేశారు. రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వ్యక్తి ఎవరో తిట్టారని సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు. ప్రచారానికి రాకపోతే ఆయనకే చెడ్డపేరు వస్తుందని చెప్పారు. రైతాంగ సమస్యలపై రేవంత్ రెడ్డితో కలిసి ఉద్యమించిన వెంకట్ రెడ్డి ఇప్పుడు ఆ యూనిటీని దెబ్బతీయొద్దని హితవు పలికారు.

సోనియా అంత చేస్తే.. మనం ఎంత చేయాలి..

ఆరోగ్యం బాగోలేకపోయినా, విదేశాల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నా.. భారత్ జోడో యాత్రకోసం సోనియా తరలి వచ్చారని, రాహుల్ గాంధీ వెంట నడిచారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు వీహెచ్. ఆమె పార్టీకోసం అంత చేస్తుంటే, మనం ఇంకెంత చేయాలని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక అయిపోయిన తర్వాత వెంకట్ రెడ్డి విదేశాలకు వెళ్లాలని, ఇప్పుడే వెళ్తే.. ఎన్నారైలు కూడా ఆయన్ను నిలదీస్తారని చెప్పారు. అధికార పార్టీ నేతలు కోవర్ట్ రెడ్డి అంటూ హేళన చేయడం సరికాదన్నారు వీహెచ్.

First Published:  13 Oct 2022 3:37 PM IST
Next Story