Telugu Global
Telangana

రాజగోపాల్‌ రెడ్డితో మాట్లాడనున్న దిగ్విజయ్ సింగ్..!

ఈ సమస్యను రాష్ట్ర నేతలు పరిష్కరించలేక పోతున్నారనే భావనలో అధిష్టానం ఉన్నది. దీంతో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది.

రాజగోపాల్‌ రెడ్డితో మాట్లాడనున్న దిగ్విజయ్ సింగ్..!
X

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనట్లే తెలుస్తున్నది. పార్టీకి దక్షిణ తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక బలంగా అధిష్టానం కూడా భావిస్తోంది. వీరిద్దరిలో ఏ ఒక్కరిని కోల్పోయినా పార్టీకి నష్టం తప్పదనే అంచనాకు వచ్చింది. ఈ సమస్యను రాష్ట్ర నేతలు పరిష్కరించలేక పోతున్నారనే భావనలో అధిష్టానం ఉన్నది. దీంతో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది.

ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్‌కు ఇక్కడి రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉన్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కొరుకుడు పడటం లేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారడంపై అన్న వెంకటరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీలోకి వెళ్తాననే హింట్ ఇచ్చారు.

గురువారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. తన తమ్ముడు ధోరణితో అన్న వెంకటరెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాను పలుమార్లు పార్టీని వీడొద్దని సూచించానని, కానీ ఇప్పుడు అది తన చేతిలో లేదని వెంకటరెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వదలి పోకుండా తన శాయశక్తుల ప్రయత్నిస్తానని కూడా వెంకటరెడ్డి చెప్పినట్లు సమాచారం.

గురువారం జరిగిన పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా పరిశీలించిన తర్వాత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. రాజగోపాల్ రెడ్డిని తీసుకొని ఢిల్లీకి రావాలని, ఈ విషయంలో దిగ్విజయ్ సింగ్‌కు సహాయం చేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

మునుగోడు కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన నెలకొనడంతో స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కాంగ్రెస్ ముఖ్యనేతలను కోరినట్లు తెలుస్తున్నది. ఆయన ఉంటే చాలా సంతోషం.. వెళ్లిపోతే మాత్రం వెంటనే మునుగోడు అభ్యర్థిని ప్రకటించాలని వారు కోరారు. మొత్తానికి మునుగోడు పంచాయితీ ప్రస్తుతం ఢిల్లీకి చేరడంతో ఆసక్తికరంగా మారింది.

First Published:  29 July 2022 8:48 AM IST
Next Story