కరీంనగర్ అభ్యర్థి ఎవరు.. కాంగ్రెస్ మల్లగుల్లాలు.!
కాంగ్రెస్ నుంచి నిన్నామొన్నటి వరకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రవీందర్ రావుల పేర్లు వినిపించాయి. తాజాగా తీన్మార్ మల్లన్న పేరు తెర మీదకు వచ్చింది.
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, బీజేపీ తరఫున బండి సంజయ్ అభ్యర్థులుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలకపోవడంతో స్థానిక కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కరీంనగర్‌ను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తుంటే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి ఎవరనేది తేల్చట్లేదు.
తెరపైకి ముగ్గురి పేర్లు..!
కాంగ్రెస్ నుంచి నిన్నామొన్నటి వరకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రవీందర్ రావుల పేర్లు వినిపించాయి. తాజాగా తీన్మార్ మల్లన్న పేరు తెర మీదకు వచ్చింది. తీన్మార్ మల్లన్న స్థానికుడు కాకపోయినప్పటికీ.. బీసీ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో పార్టీ హైకమాండ్ ఆయన పేరు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల అభిప్రాయాలు సైతం తెలుసుకునేందుకు పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇక ఈనెల 31న మరోసారి సమావేశం కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. మిగిలిన స్థానాలపై తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈనెల 31న ఈ నాలుగు స్థానాలపై క్లారిటీ వస్తుందని సమాచారం.